గిదేంది కేసీయారూ గీ 'జీఎస్‌టీ' లొల్లి.?

జీఎస్‌టీ పన్ను విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. అద్భుతః అని కొంతమంది మేధావుల అభివర్ణిస్తోంటే, ఇంకొంతమందేమో శుద్ధ దండగ అంటున్నారు. ఎవరి వాదన వారిదే. ఒక్కటి మాత్రం నిజం.. 'ఒకే దేశం.. ఒకే పన్ను' అన్న మాట వినడానికి చాలా చాలా బాగుంటుంది.

అయితే, జీఎస్‌టీ అమల్లోకి వచ్చాకే ఇందులో మతలుబులు చాలా వున్నాయన్న విషయం సుస్పష్టమవుతోంది. ఒకటే దేశం.. ఒకటే పన్ను కాదనీ, అందులోనూ చాలా మెలికలు వున్నాయనీ ఒక్కో 'మెలిక' వెలుగు చూస్తోన్న కొద్దీ, జీఎస్‌టీపై ముందస్తు అనుమానాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. 

ఇక, జీఎస్‌టీతో అంతా లాభమేనని తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా సెలవిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేశారు. అంతలా జనం విస్మయం చెందడానికీ కారణం లేకపోలేదు.. తెలంగాణకి జీఎస్‌టీతో నాలుగు వేల కోట్ల నష్టమని సాక్షాత్తూ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పుకొచ్చారు ఈ మధ్యనే. మరి, తెలంగాణకు జీఎస్‌టీతో లాభమని కేసీఆర్‌ చెబుతున్న మాటల్లో వాస్తవమెంత.? 

ఈటెల రాజేందర్‌ చెప్పినా, కేసీఆర్‌ చెప్పినా.. ఆ లాభ నష్టాల వెనుక అసలు కోణం వేరే వుంటుంది. లాభం ప్రభుత్వాలకీ, నష్టం ప్రజలకీ అన్న మాట. బహుశా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వానికి వచ్చే లాభం గురించీ, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రజలకు కలిగే నష్టం గురించీ చెప్పి వుండొచ్చు.! 

జీఎస్‌టీ వస్తోందని తెలిసీ, తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది కేసీఆర్‌ సర్కార్‌. కానీ, అంతలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీఎస్‌టీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎంత గందరగోళం వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

రాష్ట్రాల నిర్ణయం మేరకు జీఎస్‌టీ శ్లాబ్‌ రేట్లు నిర్ణయించామనీ, ఏయే వస్తువులు ఏ శ్లాబ్‌లో వుండాలన్నది రాష్ట్రాలే నిర్ణయించాయనీ కేంద్రం తెలివిగా రాష్ట్రాల నెత్తిన జీఎస్‌టీని రుద్దేసింది. దాంతో, జీఎస్‌టీకి ఒకే చెప్పిన రాష్ట్రాల గొంతులో పచ్చివెలక్కాయ పడిందన్నమాట. అప్పుడు ఒప్పుకుని, ఇప్పుడు కాదంటే కుదరదు కదా.. అద్గదీ, అందుకే ముఖ్యమంత్రిది ఒక మాట, ఆర్థిక మంత్రి ఇంకో మాట. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. 

అసెంబ్లీల్లో జీఎస్‌టీకి ఆమోదం తెలిపినప్పుడు ఈ సమస్యలేవీ మన పాలకులకు గుర్తుకురాకపోవడం ప్రజల దురదృష్టం అంతే.

Show comments