ఇప్పటికే ఒక సారి దక్షిణాది చిత్ర పరిశ్రమ తీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేసింది తాప్సీ. దక్షిణాదిన దర్శకులు తన అందాలను చూపించే ప్రయత్నం చేశారు, కానీ.. తనలోని నటిని వెలికి తీసే పాత్రలేవీ అక్కడ దక్కలేదని బాలీవుడ్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాప్సీ వ్యాఖ్యానించింది. తెలుగునాట రాఘవేంద్రరావు వంటి దర్శకుడి సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన తాప్సీ అక్కడకు వెళ్లి అలాంటి కామెంట్ చేయడం వార్తల్లోని అంశంగా నిలిచింది.
మరి దక్షిణాది చిత్ర పరిశ్రమల గురించి ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన తాప్సీకి ఇక సౌత్ లో అవకాశాలు దక్కకపోవచ్చని కొంతమంది అభిప్రాయపడ్డారు. మరి తాప్సీని సౌత్ వాళ్లు తిరిగి ఆదరించడం సంగతెలా ఉన్నా... ఇప్పుడు ఆమె నటనకు బాలీవుడ్ సినీ పండితులు, మీడియా బ్రహ్మరథం పడుతుండటంతో ఇక ఈ అమ్మడికి దక్షిణాది వైపు తిరిగి చూడాల్సిన అవసరం కూడా ఉండదేమో అనే మాట వినిపిస్తోంది!
“పింక్’’ సినిమాలో తాప్సీ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇలాంటి పాత్ర దొరకడం తాప్సీ అదృష్టం, తాప్సీ అద్భుత నటన ఆ పాత్రకు దొరికిన వరం... అని సినీ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఏకగ్రీవంగా తాప్సీపై ఈ ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ఈ పొగడ్తలు చూస్తుంటే.. ఇంతకు ముందు తాప్సీ చెప్పిన మాట వాస్తవమే అనుకోవాల్సి వస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆమె నుంచి అసలైన ప్రతిభను వెలికి తీయలేకపోయింది, ఆ స్థాయి పాత్రలు రాలేదు..అనేది ఇప్పుడు నిర్ధారణ అయిన అంశం గా అగుపిస్తోంది. ఏదో పొగరుబోతు మాటల్లాగా కాకుండా, చెప్పి మరీ తాప్సీ సత్తా చాటింది.
ఇప్పటికే హిందీలో ‘బేబీ’ వంటి హిట్ సినిమా తాప్సీ ఖాతాలో ఉంది. ఇప్పుడు “పింక్’’ తో వచ్చిన ఊపుతో.. ఇక తాప్సీ నటిగా బాలీవుడ్ లో ఉన్నత స్థాయికి దూసుకుపోతుందేమో! ఈ తరహా పాత్రలతో తిరిగి దక్షిణాది పరిశ్రమలకు అందనంత ఎత్తుకు ఎదుగుతుందేమో!