గూబ గుయ్యిమంది మరి.!

''ఐదు వేల రూపాయలకు పైబడి బ్యాంకుల్లో పాత పెద్ద నోట్లను రద్దు చేయాల్సి వస్తే, అది ఒక్కసారికే పరిమితం. అది కూడా, 'ఎందుకు ఇప్పటిదాకా ఈ సొమ్ముల్ని డిపాజిట్‌ చేయలేదు?' అన్న ప్రశ్నకు బ్యాంకు అధికారుల్ని సంతృప్తి పరిచేలా మీ సమాధానం వుండాలి..'' 

- ఇదీ రిజర్వు బ్యాంకు నిన్నగాక మొన్న చేసిన 'తుగ్లక్‌' ప్రకటన. 

డిసెంబర్‌ 30 వరకూ బ్యాంకుల్లో పెద్ద పాత నోట్ల మార్పిడికి అవకాశం వుందని గతంలో అటు కేంద్రం, ఇటు ఆర్‌బిఐ ప్రకటించిన విషయం విదితమే. ఆ తర్వాత రూటు మార్చి, పెద్ద పాత నోట్ల మార్పిడిని పూర్తిగా పక్కన పడేశారు. కేవలం డిపాజిట్లు మాత్రమే బ్యాంకులు తీసుకుంటాయనే 'తుగ్లక్‌' ప్రకటన వచ్చింది. అక్కడికీ జనం సర్దుకుపోయారు. తప్పదు మరి, దేశాన్ని నరేంద్రమోడీ ఉద్ధరించేస్తానంటున్నారు గనుక, డిసెంబర్‌ 30 వరకూ వేచి చూద్దామనుకున్నారు. 

ఒంగుతున్నాడు కదా.. అని ఇంకా ఇంకా ఒంగోబెట్టేసి, నడుం విరగ్గొట్టేద్దామనుకుంటే ఊరుకోడానికి జనం వెర్రి వెంగళప్పలు కాదు కదా.! అందుకే, 'ఒక్కసారి మాత్రమే ఐదు వేల పైబడి పాత పెద్ద నోట్ల డిపాజిట్‌' అనే తుగ్లక్‌ నిర్ణయంపై సగటు ప్రజానీకం తిరగబడ్డారు. ఎందుకు పాత నోట్లను ఇప్పటిదాకా డిపాజిట్‌ చేయలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలా.? అది కూడా, బ్యాంకు సిబ్బందికి సంతృప్తి కలిగించే సమాధానం చెప్పాలా.? అని జనం ఎదురు ప్రశ్నించారు. 

దాంతో అటు కేంద్రం, ఇటు ఆర్‌బిఐ తాము చేసిన తుగ్లక్‌ పనికి సిగ్గుతో తలదించుకున్నట్టుంది. రాత్రికి రాత్రి పాత ఆదేశాల్ని రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఈ స్థాయిలో అటు కేంద్రానికీ, ఇటు రిజర్వు బ్యాంకుకీ గూబ గుయ్యిమనడం ఇదే తొలిసారి. ఇప్పుడే ఏముంది.? ముందుంది మొసళ్ళ పండగ. డిసెంబర్‌ 30 తర్వాత జనం సంధించే ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమాధానం చెబుతారో, నెత్తిన ముసుగేసుకుంటారో వేచి చూడాల్సిందే.!

Show comments