పూరి ఇలా ఎందుకు చేస్తున్నాడు.?

తెలుగు సినీ పరిశ్రమలో పూరిజగన్నాథ్‌ అంటే ఓ బ్రాండ్‌. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, గతంలోలా ఇప్పుడు పూరిజగన్నాథ్‌ సినిమాల్లో ఆ 'వెలుగు' కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా పూరిజగన్నాథ్‌ తానేంటో నిరూపించుకోవాల్సిన సందర్భమిది. బాలకృష్ణతో కొత్త సినిమాని అనౌన్స్‌ చేసి, పూరి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. అంతకన్నా పెద్ద షాక్‌ ఏంటంటే, బాలయ్య సినిమా కోసం 'కాస్టింగ్‌ కాల్‌'ని పూరి ప్రకటించడం. 

పూరి కనెక్ట్స్‌ ద్వారా నటీనటుల ఎంపికకు తెరలేపాడు. బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్లు, విలన్లు, ఇతరత్రా తారాగణాన్ని పూరి కనెక్ట్స్‌ ద్వారా ఎంపిక చేస్తారట. ఈ మొత్తం వ్యవహారాల్ని పూరి బిజినెస్‌ పార్ట్‌నర్‌ ఛార్మి చూసుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

అసలు పూరి ఎందుకిలా చేశాడు.? ఇది బాలయ్యను అవమానించడమే కదా.? అన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. నిజానికి, చిరంజీవితో సినిమా చేయాల్సిన పూరి.. అప్పట్లో కూడా ఇలాంటి ప్రతిపాదనే చేయడంతో చిరంజీవి తోసిపుచ్చారంటూ కొత్త గాసిప్‌ బయల్దేరింది. తెలుగు తెరకు పూరి చాలామంది హీరోయిన్లని పరిచయం చేశాడన్నది నిర్వివాదాంశం. కానీ, అప్పట్లో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు పూరి చెయ్యలేదు. ఇలాంటి స్టంట్స్‌ చేయడంలో తేజ దిట్ట. అలా నటీనటుల ఎంపికతో తేజకి వచ్చిన మంచి పేరు కన్నా, చెడ్డపేరే ఎక్కువ. నటీనటుల ఎంపికలో క్రియేటివిటీ చూపించి, సినిమాల్లో క్రియేటివిటీని తగ్గించేశాడాయన. పూరి విషయంలోనూ ఇప్పుడు అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వేలల్లో లక్షల్లో వచ్చే దరఖాస్తులు, వాటి స్క్రూటినీ.. అదంతా పూర్తయ్యాక, కొత్తవారికి నటనలో శిక్షణ ఇప్పించడం.. ఇదంతా పూర్తయ్యి, బాలకృష్ణ హీరోగా సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు రావాలి.? సొంత బ్యానర్‌ మీద చిన్న సినిమా ఒకటి అనౌన్స్‌ చేసేసి, దాంట్లో కొత్త నటీనటులతో సినిమా చేయించే వీలున్నా.. అది పక్కన పడేసి, బాలయ్యతో పూరి ఈ ప్రయోగమేంటట.? ఏమో మరి, పూరి ఈ క్రమంలో సక్సెస్‌ అవుతాడా.? మరో తేజ అయిపోతాడా.? వేచి చూడాల్సిందే. Readmore!

Show comments

Related Stories :