క్రికెట్‌ బెట్టింగుల్లో రాజకీయ నేతలు

ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా పందాలు

ఐపీఎల్‌ క్రికెట్‌ నేపథ్యంలో సాధారణవర్గాల నుండి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం బిజీ అయిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో బెట్టింగుల్లో అరితేరిన రాజకీయ పార్టీల నేతలు కోట్లలో ఈ బెట్టింగులకు పాల్పడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు పందాల్లో బిజీ అయ్యారు. అయితే వీరందరూ అండర్‌ గ్రౌండ్‌లోనే ఇదంతా నడిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో చాలా కాలంగా బెట్టింగ్‌ బృందాలు హవా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొందరునేతలు జాతీయస్థాయి క్రికెట్‌ బుకింగ్‌లతో సంబంధాలు కలిగివున్నారు. వీరు గతంలో బెట్టింగుల్లో అరితేరి, సొమ్ము భారీగా సంపాదించారు. క్రికెట్‌ జూదంలో నెంబర్‌వన్‌గా ఉంటూ, యవతను, కుర్రకారును ఈ మత్తులో దిగేలా చేశారు. అలాగే తెలుగుదేశానికి చెందిన నేతలు కూడా బెట్టింగుల్లో ఆరితేరారు. 

ఈ బెట్టింగుల్లో ప్రస్తుతం చోటామోటా నేతలు హవా సాగిస్తున్నారు. ఇదిలావుంటే గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ జోరందుకున్నాయి. గతంలో ఐపీఎల్‌ సీజన్‌ సందర్భాలలో జరిగిన బెట్టింగ్‌లకు ధీటుగా ప్రస్తుతం సీజన్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పందాల జోరు పెరిగింది. క్రికెట్‌పై విద్యార్థులు, యువత సహా ఆయా వర్గాలకున్న ఆసక్తి ఆసరాగా తీసుకుని పలువురు బెట్టింగ్‌లను నడిపిస్తున్నారు. టాస్‌ ప్రారంభం నుండి బాల్‌ టు బాల్‌ పరుగులు, వికెట్లు, గెలుపోటములు, ఫలానా బ్యాట్‌మెన్‌ తీసే పరుగులు తదితర అంశాలపై పందాలు కడుతుండటం విశేషం! బెట్టింగ్‌లకు పేరెన్నికగన్న విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, ముంబై తదితర నగరాలకు చెందిన బుకీలతో అనుసంధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పందెంరాయుళ్ళు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

 బెట్టింగుల్లో పాల్గొనేవారు తొలుత వారి బ్యాంక్‌ ఖాతా వివరాలను బుకీలకు ఇచ్చిన తర్వాతే పందెంకాసే అవకాశం ఉంటుంది. తాజాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌లో పందాల ఫీవర్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ఆయా వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో టెస్ట్‌, వన్‌డే మ్యాచ్‌లు జరిగేవి! ప్రస్తుతం టీ-20 మ్యాచ్‌లు నడుస్తున్నాయి. వేసవి సీజన్‌లో ఐపీఎల్‌ ప్రారంభమవుతుండటంతో హాలీడేస్‌లో ఇండే యువత ఇటువైపు అధికంగా దృష్టి సారిస్తోంది. క్రికెట్‌పై ఉన్న అభిమానం బెట్టింగ్‌లకు దారితీస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పలువురు స్నేహితులు బృందాలుగా ఏర్పడి పందాలు కాస్తున్నారు. మరికొందరు బుకీల సహకారంతో బెట్టింగులు సాగిస్తున్నారు. ఈ తంతు భీమవరం, ఏలూరు, సరసాపురం, తాడేపల్లి గూడెం, కాకినాడ, రాజమహేంద్రవరం, అనపర్తి, అమ లాపురం, మండపేట, రావులపాలెం, తుని, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. మొబైల్స్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది.  Readmore!

ఎవరితో బెట్టింగ్‌ చేయదలచారో, వారితో ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా ఈ పందాలు కాయాల్సి ఉంటుంది. బెట్టింగ్‌లు ఆడేవారు ఇతరులకు అర్ధంకాకుండా కోడ్‌ భాషను అనుసరిస్తూ, కోడ్‌ల ప్రకారం బెట్టింగ్‌ల్లో గెలిస్తే పందెం కాసిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. క్రికెట్‌పై తాజా ఆసక్తి ఉండి, తెల్లారింది మొదలు స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని, ఆన్‌లైన్‌ సేవలను వాడుకునే యువత ఈ ప్రక్రియ వైపు బాగా మొగ్గుతున్నారు. అయితే చాలా వరకు ముందుగా డబ్బులు కట్టకుండానే బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ అయిపోగానే వారి బెట్టింగుల్లో ఎవరికి ఎవరు ఎంతివ్వాలో తేల్చుకున్న అనంతరం సొమ్ము చేతులు మారుతోంది. ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారు కనీసం వెయ్యిరూపాయలు నుండి లక్షవరకు పణంగా పెడుతున్నారు. బెట్టింగు సంస్కృతి కారణంగా యువత ఆర్ధికంగా చితికిపోతున్నారు. ఇదిలావుండగా భారీగా సాగుతున్న ఈ బెట్టింగులపై పోలీసు యంత్రాంగం నిఘా ఉంచింది. అయితే బెట్టింగు వీరుల్లో రాజకీయ నాయకులే అధికంగా ఉండటంతో వారి జోలికి పోలీసులు వెళ్లడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హోంమంత్రి ఇలాఖాలో!

రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప స్వంతజిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు భారీగా జరుగుతుండటం ఆయా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా హోంమంత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దాపు రం నియోజకవర్గంలో సైతం బెట్టింగు వీరులు రెచ్చిపోతుండటం గమనార్హం! ఈ విషయంలో హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెట్టింగుల కారణంగా పెడదారి పడుతున్న యువత భవితవ్యం అంధకార బంధురంగా మారిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. బెట్టింగులు, అనధికార క్లబ్‌లు, పేకాట కేంద్రాలపై తగిన నిఘా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

Show comments