తిరిగిచ్చేద్దాం.. లేకపోతే వీకైపోతాం.!

'తిరిగిచ్చేయ్యాలి.. లేదంటే లావైపోతారు..' అంటూ తెలుగులో 'శ్రీమంతుడు' సినిమా కోసం సూపర్బ్‌ డైలాగ్‌ని రాసేశారు. అప్పట్లో ఈ డైలాగ్‌ సూపర్‌ పాపులర్‌. ఊరి నుంచి చాలా తీసుకున్నాం, ఎంతో కొంత తిరిగిచ్చెయ్యాల్సిందే.. లేకపోతే లావైపోతామన్నది ఆ డైలాగ్‌ సారాంశం. మంచి ఆలోచనే కదా.! ఆ సినిమా స్ఫూర్తితో తిరిగిచ్చేయడానికి చాలామంది ముందుకొచ్చారండోయ్‌.! 

ఇక, అసలు విషయానికొస్తే, 'తిరిగిచ్చెయ్యాలి.. లేకపోతే వీకైపోతాం..' అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనం. 'జగ్గాజాసూస్‌' సినిమా టైమ్‌లో, సినిమా ఫలితం తేడా వస్తే, డిస్ట్రిబ్యూటర్లను తాను ఆదుకుంటానంటూ ముందుకొచ్చాడు ఆ సినిమా హీరో రన్‌బీర్‌ కపూర్‌. సినిమా ఫ్లాపయ్యింది, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. మరి, తిరిగిచ్చేశాడా రణ్‌బీర్‌కపూర్‌.? ఆ దాఖలాలైతే లేవు. 

మరో సినిమా 'ట్యూబ్‌లైట్‌'దీ అదే పరిస్థితి. ఈసారి సల్మాన్‌ఖాన్‌ మాత్రం ఓ అడుగు ముందుకేశాడు. ఏకంగా 35 కోట్ల రూపాయల్ని తిరిగిచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే, వచ్చిన నష్టాల్లో ఇది సగం మాత్రమే. అయినాసరే, ఎంతో కొంత తిరిగిచ్చేస్తున్నందుకు సల్మాన్‌ఖాన్‌ని అభినందించాల్సిందే. 

షారుక్‌ఖాన్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 'జబ్‌ హ్యారీ మెట్‌ షెజాల్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతినేసింది. షారుక్‌ కూడా తిరిగిచ్చేసేందుకు లెక్కలేసుకుంటున్నాడట. హీరోలు, తమ తమ సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటుండడంతో, ఫలితం తేడా వచ్చినప్పుడు వారి మీదా ఒత్తిడి తీవ్రంగా వుంటోంది. ఈ కారణంగానే, 'బ్యాడ్‌నేమ్‌' వచ్చేకుండా ఈ తిరిగిచ్చేసే పద్ధతికి నడుం బిగించారన్నమాట. మన తెలుగులోనూ ఆ ట్రెండ్‌ ముందు ముందు చూడబోతున్నామా.? తప్పదు మరి, పరిస్థితులు డిమాండ్‌ చేస్తే ఎవరైనాసరే, తిరిగిచ్చేయక తప్పదు.

Show comments