జూన్ 23.. ఈ తేదీ చుట్టూ చాలా హంగామా జరిగింది. తెరవెనక చాలా లాబీయింగ్ నడిచింది. ఒక దశలో మహేష్-నాని మధ్య పోటీ తప్పదనుకున్నాం. ఆ తర్వాత 24 గంటలకే నాని-బన్నీ మధ్య వార్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయాం. కానీ అలాంటివేం లేవు. హీరోలంతా అన్యోన్యంగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను పంచుకున్నారు. రెండు బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ కాకుండా మినిమం గ్యాప్ ఇచ్చుకున్నారు.
జూన్ 23వ తేదీని ఫస్ట్ ఎనౌన్స్ చేసిన హీరో మహేష్. స్పైడర్ సినిమా కోసం ఆ తేదీ లాక్ చేశారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్ లేట్ అవుతూ వస్తుండడం, పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా టైం కావాల్సి రావడంతో స్పైడర్ ను వాయిదా వేశారు. మహేష్ మూవీ ఏకంగా ఆగస్ట్ కు షిఫ్ట్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 11న స్పైడర్ రిలీజ్ అవుతుంది. వీకెండ్ తో పాటు... పంద్రాగస్ట్ కూడా స్పైడర్ కు కలిసిరానుంది.
మహేష్ తప్పుకోవడంతో వెంటనే ఆ డేట్ ను లాక్ చేసుకున్నాడు నాని. నిజానికి జూన్ 23న నాని నటిస్తున్న నిన్ను కోరి సినిమాను రిలీజ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మ్యాగ్జిమమ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ బన్నీ కూడా తన డీజే సినిమా కోసం జూన్ 23నే లాక్ చేయడంతో నాని తన కొత్త సినిమాను జులైకి వాయిదా వేసుకున్నాడు.
అలా బన్నీ, నాని, మహేష్ చెరో నెలను పంచుకున్నారు. ఇక సెప్టెంబర్ విషయానికొస్తే ఆ నెలలో ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ, బాలయ్య 101వ సినిమా, పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ మూవీస్ రేసులో ఉన్నాయి. మరి ఈ ముగ్గురిలో ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడతారా.. లేక వీళ్లు కూడా డేట్స్ పంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది.