ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే.. టీడీపీకి ఎన్ని?

నిన్ననో మొన్ననో తెలుగుదేశం అనుకూలురు ఒక సర్వేను ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది ఇండియాటుడే సర్వే అంట. దాని ప్రకారం మోడీ పట్ల జనాల్లో సానుకూల దృక్పథం ఉందని.. ఎన్నికలొస్తే కొన్ని సీట్లు కోల్పోవచ్చు గాక.. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలిందట. మరి మోడీ పట్లే సానుకూలత ఉంటే.. చంద్రన్న పట్ల ఇంకెంత సానుకూలత ఉండాలి? అనేది వీళ్లు జనాలకు వేసిన ప్రశ్న!

మరి ఈ అంశం గురించి ఏపీ ప్రభుత్వమే ఒక అధ్యయనం చేయించుకుందని ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పట్ల ప్రజల దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఈ సర్వేను చేయించుకున్నారని తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలు ప్రభుత్వానికి విస్మయాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రబలుతోందని ఈ అధ్యయనం తేల్చినట్టు సమాచారం.

175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 51 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చినట్టుగా తెలుస్తోంది. తమకు విశ్వసనీయమైన సంస్థతోనే ప్రభుత్వం ఈ సర్వేను చేయించుకున్నా ఈ రకమైన ఫలితాలు రావడం విశేషం. ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిన చాలా మంది తెలుగుదేశం పార్టీకి తిరిగి ఓటు వేసే పరిస్థితుల్లో లేరని ఈ అధ్యయనం అభిప్రాయపడిందని తెలుస్తోంది. దీని ఫలితం ప్రతిపక్షానికి భారీ లాభాన్ని కలిగించే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసినట్టు సమాచారం.   

ఇటీవలే రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. తన పాలనలో 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కూడా బాబు చెప్పుకొంటూ ఉన్నారు. ఇక అభివృద్ధే అభివృద్ధి అని అనుకూల మీడియా క్షణం ఆగకుండా ప్రచారం చేసి పెడుతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నారు. అదేమంటే.. అదీ అభివృద్ధే అని అంటున్నారు!

మరి ఇలాంటి నేపథ్యంలో.. ఇలాంటి సర్వే ఫలితాలు వెలుగులోకి రావడం ప్రభుత్వ పెద్దలను నిస్సందేహంగా కలవర పరిచే అంశమే.

Show comments