ఎన్టీఆర్ ను బీట్ చేయలేకపోయిన మహేష్

మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవైపు టీజర్ లో కొత్తదనం లేదని, కూసింత రొటీన్ గానే ఉందంటూ విమర్శలు వస్తున్నప్పటికీ.. చూసేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా స్పైడర్ టీజర్ కు కోటి వ్యూస్ వచ్చాయి. అయితే ఇంత హంగామా నడుస్తున్నప్పటికీ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఓ రికార్డును మాత్రం మహేష్ బద్దలుకొట్టలేకపోయాడు.

రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి జై టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 4.98 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్పైడర్ టీజర్ కు మాత్రం ఒక రోజులో 4.04 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. 

అయితే స్పైడర్ టీజర్ కు సంబంధించి మొదట్నుంచి తెలుగు, తమిళ్ వ్యూస్ కలిపి చెబుతున్నారు. అలా 24 గంటల్లోనే 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. అది కూడా ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి చెబుతున్నారు. కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన లెక్కలు చూసుకుంటే మాత్రం జై టీజర్ దే మొదటి స్థానం. 

ఈ లిస్ట్ లో మూడో స్థానంలో కాటమరాయుడు టీజర్ నిలవగా.. 4, 5 స్థానాల్లో డీజే, సాహో సినిమా టీజర్లు నిలిచాయి.

Show comments