అమిత్‌ షా ఉచ్చులో కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం రావడానికి దాదాపు నాలుగుదశాబ్దాలు పట్టింది కాని తెలంగాణ రాష్ట్ర సమితికి ఐదేళ్లలోనే ప్రత్యామ్నాయంగా అవ తరించడానికి భారతీయ జనతా పార్టీ విశ్వయత్నాలు చేస్తోంది.

మామూలుగా అయితే భారతీయ జనతా పార్టీని కేసీఆర్‌ విస్మరించవచ్చు. బీజేపీకి తెలంగాణలో పెద్ద సంఖ్యాబలం లేదు. కేడర్‌ కూడా తక్కువే ఉన్నారు. కాని ఎందుకో ఈసారి బీజేపీని చూడగానే కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించడం చూసి కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అమిత్‌ షా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతోనూ, బూత్‌ కమిటీ సభ్యులతోనూ మాట్లాడితే ఆ మాటలు విని కేసీఆర్‌ ప్రతిస్పందించిన తీరు ఆశ్చర్యకరంగా ఉన్నది.

తెలంగాణకు రూ.లక్షకోట్లు ఇచ్చామని అమిత్‌ పార్టీ కార్యకర్తలతో చెప్పుకుని ఉండవచ్చు. ఆయన ఎక్కడా పత్రికా సమావేశం పెట్టి వ్యాఖ్యానం చేయలేదు. బహిరంగ సభలో విమర్శించలేదు. అయినప్పటికీ కేసీఆర్‌ వెంటనే అమిత్‌ షాను ఖండించడానికి పూనుకున్నారు.

గతంలో అందరు నాయకులపై విరుచుకుపడినట్లే ఆయన అమిత్‌ షాను దుర్భాషలాడారు. ఇదివరకు మోడీ, గీడీ అన్నట్లే అమిత్‌ షా, గిమిత్‌ షా అంటూ మాట్లా డారు. భ్రమిత్‌ షా అన్నారు. నల్గొండ కూడలిలో పాము లాట పెట్టి ఆడితే భయపడేది లేదన్నారు. చిల్లర రాజ కీయాలు చేస్తున్నారన్నారు.

కేసీఆర్‌ విరుచుకుపడడాన్ని చూస్తే మైదాన స్థాయిలో బీజేపీ బలపడుతుందేమోనన్న భయం ఆయనలో కనపడుతున్నది. కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న రీత్యా ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంటుందేమనని ఆయన అనుకుంటున్నారు.

అమిత్‌ షా ఎక్కడ తిరిగాడు.. ఏ హోటల్‌లో భోంచేశాడు అన్న వివరాలు కూడా ఆయన తెప్పించు కుని విమర్శించారు. అంటే అమిత్‌ షా వెంట ఇంటిలిజెన్స్‌ అధికారులను ఆయన నియమించాడన్నమాట.

బహుశా అమిత్‌ షా అనుకున్నట్లే కేసీఆర్‌ వ్యవహరించాడేమో. భాజపాను చూస్తే కేసీఆర్‌కు బీపీ వస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీని ప్రధాన పార్టీగా రాష్ట్రం లో ఏర్పర్చేందుకు కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగా సహకరి స్తున్నారా లేక అనాలోచితంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

నిజానికి బీజేపీ అంటూ తెలంగాణలో బలపడితే కేసీఆర్‌ వల్లే బలపడాలి. లేకపోతే మైనారిటీలకు రిజర్వేషన్‌ విషయం ఎత్తుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల వరకు కేసీఆర్‌ హవా బాగానేసాగింది. అయితే మూడేళ్ల తర్వాత కేసీ ఆర్‌ పాలన చూస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి గతంలో లాగా గట్టెక్కే పరిస్థితి ఆయనకు కనపడడం లేదు. అందుకే ఆయన బీజేపీని బలపరిచి, ఓట్లు చీల్చి తాను వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టే అవకాశాలూ లేకపోలేదు.

ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ బలం తెలంగాణలో అంతగా లేకపోయినా ఆ పార్టీని తక్కువ అంచనా వేయడానకి వీలులేదు. ఉత్తరాదిన 2014లో వచ్చినట్లు బీజేపీకి ప్రభంజనం వచ్చే అవకాశం లేదని, కనీసం 50 సీట్లైనా తగ్గుతాయని మోడీ భావిస్తున్నారు. ఆమేరకు దక్షిణాది నుంచి ప్రయోజనం పొందుతామని బీజేపీ భావిస్తోంది.

అమిత్‌ షా అందుకే తన 95 రోజుల దక్షిణాది, ఒడిషా పర్యటనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ప్రధానంగా ఎంచుకున్నారు. తమిళనాడుతో ఆయన పర్యటన ముగుస్తుంది.

తెలంగాణలో అమిత్‌ షా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన నల్లగొండను ఆయన తన పర్యటన కేంద్రంగా ఎంచుకున్నారు. నిజాం పాలనలో రజాకార్లు 250 మందిని హతమార్చిన గుండ్రాంపల్లిలోనూ, సీపీఐ(ఎం) కంచు కోట అయిన తీర్థపల్లిలోనూ ఆయన పర్యటించారు. గ్రామ స్థాయిలో, మారుమాల ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆయన కలుసుకున్నారు.

ప్రతి ఇంటికీ ఆయన తిరిగారు. బూత్‌స్థాయి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఒక జాతీయపార్టీ అధ్యక్షుడుగా ఉండి, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన వ్యక్తి తెలంగాణలో ఇంటింటికి తిరగడం అంటే సామాన్యం విషయం కాదు.

తాను పర్యటించిన మూడురోజుల్లో ఆయన పార్టీ నేతలకు పలుసార్లు క్లాసులు తీసుకున్నారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలన సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రసమితి రాష్ట్రానికి ఏమిచేసిందని ఆయన ప్రశ్నించారు. నిజాం గుండాలు తెలంగాణ ప్రజలను హతమారిస్తే కెసీఆర్‌ ఓట్లకోసం నిజాంను తలకెత్తుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమకు ప్రత్యర్థే అని ఆయన ఒక్క మాటలో స్పష్టంచేశారు.

ఇంతకీ అమిత్‌ షా తెలంగాణలో బీజేపీని ఏ విధంగా బలపరుస్తారు? తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం బలమైన నాయకులు ఎవరూలేరు. కిషన్‌ రెడ్డి వంటి నేతలపై అమిత్‌ షా సంతృప్తికరంగా లేరు. కిషన్‌ రెడ్డి పార్టీని గతంలో నడిపించిన తీరు, ఇప్పుడు మోడీ పేరు చెప్పుకుంటూ పార్టీలో అధికారం చలాయిస్తున్న తీరుకు ఆయన అసంతృప్తికరంగా ఉన్నారు.

లక్ష్మణ్‌ మంచివాడైన ప్పటికీ నిర్వాహక సామర్థ్యం లేదు. పార్టీ అధ్యక్షుడుగా ఆయన ఉపయోగపడతారు కాని.. నాయకుడుగా ఉపయోగపడే అవకాశాలు లేవు.

అయితే కొద్దిమంది బలమైన కాంగ్రెస్‌ నేతలను బీజేపీలోకి లాగాలని అమిత్‌ షా యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. వారు పార్టీలో చేరి పార్టీకోసం కష్టపడి పనిచేస్తేనే తర్వాత పదవులు లభిస్తాయని ఆయన వారికి చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జితేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులు బీజేపీ నుంచి పిలుపుకోసం చూస్తున్నారు. కేసీఆర్‌ ఒంటెత్తుపోకడలు, కుటుంబ పాలన చూసి విసిగిపోయిన పలువురు ప్రముఖ టీఆర్‌ఎస్‌ నేతలను కూడా బీజేపీలోకి లాగే అవకా శాలున్నాయి. ఈ ఏడాది ఆఖరులోపు బీజేపీని బలో పేతం చేయాలని అమిత్‌ షా భావిస్తున్నారు.

ఇక తెలంగాణలో తెలుగుదేశంతో తెగతెంపులు చేసు కునే విషయం కూడా అమిత్‌ షా సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు తప్ప తెలుగుదేశంలో జనం కనపడడం లేదు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ మహానాడు తూతూ మంత్రంగా కనిపించింది.

ఒకపుడు హైదరాబాద్‌లో మహానాడు నిర్వహిస్తే జన సందోహం కనిపించేది. ఇప్పుడు జనాన్ని సేకరించినా టీడీపీ సభలకు వచ్చేవారు లేరు. బీజేపీ పొత్తు లేకపోతే తెలంగాణలో తెలుగుదేశం పూర్తిగా అంతమైనట్లే లెక్క. కనుక తెలుగుదేశంతో పెట్టుకుంటే బీజేపీకి నష్టమేకాని లాభం లేదని పార్టీ నేతలు అమిత్‌ షాకు చెప్పారు, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని షా వారికి చెప్పారు.

మొత్తంమీద అమిత్‌షా తెలంగాణ పర్యటన తెలంగాణ బీజేపీలో నూతనోత్తేజాన్ని తీసుకువచ్చింది. కేసీఆర్‌ ప్రత్యర్థుల్లో పలువురు బీజేపీ వస్తేనే అతడికి గుణపాఠం చెప్పగలమని భావిస్తున్నారు.

తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులు, అగ్రవర్ణాలు, బీసీలు, ఐటీవంటి రంగాల్లో చేరిన యువతరం, వ్యాపా రవర్గాలు బీజేపీకి మద్దతునిచ్చే అవకాశాలున్నాయి.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కూడా పలు తెలంగాణ జిల్లాల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు దాదా పు బీజేపీకి తరలివెళ్లే అవకాశం కనపడుతుంది.

నిజానికి కేసీఆర్‌కు తెలంగాణ నినాదమే బలం. కాని ఆయన పాలన తెలంగాణ వాదులను నిరాశపరిచింది. చెట్టు పేరుచెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ఆయన తెలంగాణ పేరు చెప్పుకుని ఇంతకాలం మనుగడ సాధించారు. కాని రోజురోజుకూ తెలంగాణ జనం ఆయన పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారు.

కేసీఆర్‌కు పెద్దగా కుల బలంలేదు. జీయర్‌స్వామి వంటి మఠాధిపతులు కూడా ఇప్పుడు మోడీ వైపు చూస్తున్నారు. ఆయనకు అండగా ఉన్న రామేశ్వరరావు కూడా మోడీ శిష్యుడయ్యారు. ఆయన కుమారుడు కేటీఆర్‌కు జనంలో కలిసే లక్షణం లేదు. మేనల్లుడు హరీశ్‌రావుకు కార్యకర్తల్లో బలం, జనంలో ఆదరణ ఉన్నప్పటికీ ఆయనను తొక్కిపెట్టడం వల్ల రాజకీయ పరిణామాలను మౌనంగా గమనిస్తున్నారు.

హరీశ్‌రావు నోరువిప్పే వరకే కేసీఆర్‌ ఆటలు సాగు తాయని ఒక నాయకుడు అన్నారు. కాని కేసీఆర్‌ చాప క్రిందకు పూర్తి నీళ్లు వచ్చే వరకూ సమీపంలో ఉన్న అసంతృప్తి వాదులు కూడా మాట్లాడరు. ఢిల్లీలో కేసీ ఆర్‌కు అసలు మంచి పేరు లేదు.

ఈ అన్ని పరిణామాలు తెలిసినందువల్లే కేసీఆర్‌ కళ్లలో భయం కనపడుతోంది. అమిత్‌ షా రాకతో ఆయన ఇది మరింత ప్రస్ఫుటమైంది.

Show comments