కళ్యాణ్ రామ్..నందమూరి వంశంలో తన రూట్లో తాను, తన కెరీర్ కోసం తాను కిందా మీదా పడుతున్న కథానాయకుడు. మడమతిప్పని వంశం అన్న ఫ్యామిలీ పేటెంట్ డైలాగ్ ను నిజం చేస్తూ, జయాపజయాలతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన సినిమాలు తనే నిర్మిస్తూ, అవిశ్రాంతంగా మందుకు వెళ్తున్నాడు. పటాస్ తో హిట్ కొట్టి, ఇజమ్ తో మరో విధమైన ప్రయత్నం చేస్తున్న కళ్యాణ్ రామ్ తో చిట్ చాట్.
ఏ ఇజమ్ గురించి ఈ సినిమా..ఒక్క జర్నలిజమేనా? ఇంకేమన్నానా?
ఒక మంచి పాయింట్ వుందండీ ఈ సినిమాలో. సాధారణంగా ఏ సినిమాలో అన్నా సమస్య ను హైలైట్ చేస్తారు, ఏదో విధంగా పరిష్కరిస్తారు. కానీ ఇక్కడ మేం సమస్య ఇదీ, దీని మూలం ఇదీ, దీనికి పరిష్కారం ఇదీ అని చెప్పబోతున్నాం. కచ్చితంగా ఈ పరిష్కారం జనాలను కచ్చితంగా ఆలోచింపచేస్తుంది. నిజమే కదా, ఇలా చేయచ్చు కదా అన్న ఆలోచన వుంటుంది. దట్ క్రెడిట్ గోస్ టు పూరి గారు.
జనాలు ఎంటర్ టైన్ మెంట్ వుంటే చాలనుకుంటున్న రోజులు ఇవి. మీ పటాస్ కూడా అదే ప్రూవ్ చేసింది. అలాంటి టైమ్ లో ఈ ఇజాలు..సిద్ధాంతాలు అవసరమంటారా?
మీరన్నది నిజమే. కానీ పూరి గారు చెప్పిన కథ నన్ను చాలా కదిలించింది. నిజంగా చెబుతున్నా, నాకు ఇలాంటి కథ, అంతకన్నా ఇలాంటి క్యారెక్టర్ దొరుకుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నేను చేయగలనా అని భయపడ్డాను. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఇలాంటి అవకాశాలు రేర్ గా వస్తాయి.
కొంపదీసి జనాలకు క్లాస్ లేమన్నా పీకుతారా?
అస్సలు..ఆ సమస్యే లేదు. మీకో సంగతి తెలుసా..నాకు అసలు క్లాస్ లు పీకడం అంటే ఇష్టం వుండదు. నాకు ఒకరు క్లాస్ తీసుకున్నా ఇష్టం వుండదు. వేరేవాళ్లకు నేను క్లాస్ పీకను. ఎవరి దోవ వారిది..అనుకుంటాను.
క్లయిమాక్స్ కోర్టు సీన్ కు కదిలిపోయారా? ఏంటి?
కోర్టు సీన్ కాదు..అదే కమిషన్ ను ముందు మాట్లాడే సీన్..అదొక్కటే కాదు. టోటల్ గా సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా. హీరోల క్యారెక్టర్ ను సృష్టించడంలో పూరిగారిది ఓ స్పెషల్ స్టయిల్.
సిక్స్ ప్యాక్ వ్యవహారం చూసి అంటున్నారా?
ఛ...ఛ..అది జస్ట్ అనుకోకుండా చేసింది. సినిమాకు ముందు నేను కొంచెం ఛబ్బీగా వున్నాను. కాస్త తగ్గండి అన్నారు. అలాగే ఎలాగూ తగ్గడం ప్రారంభించాను కదా అని ట్రయ్ చేద్దాం అని మరి కాస్త పుష్ చేసాను..వర్కవుట్ అయింది. సినిమాలో క్యారెక్టర్ కాస్త రఫ్ గా వుండాలి. అందుకు పనికివచ్చింది.
ఇటీవలి కాలంలో పూరి సినిమాలు ఫ్యామిలీకి దూరమవుతున్నాయి. అలాంటి సమయంలో మీరు ఆయనతో చేస్తున్నారు.?
మీరు అన్నది కొంత వరకు నిజమే. కానీ ఈ సినిమాలో మీరు కొత్త పూరి జగన్నాధ్ ను చూస్తారు. రొటీన్ డైలాగ్ లా చెప్పడం లేదు. నిజంగా చెబుతున్నా. ఆయన మనసు పెట్టి ఈ కథ చేసారు. ఒక్క రఫ్ సీన్ కానీ, రఫ్ డైలాగ్ కానీ, అమ్మాయిల మీద సెటైర్లు కానీ ఏవీ వుండవు. పైగా ఒక మదర్ సెంటిమెంట్ సీన్ వుంది..కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తనికెళ్లతో నా సీన్ ఒకటి వుంది..చూసాక మీరే అంటారు..పూరి మారారు అని.
ఇంతలా చెబుతున్నారు..అవార్డులు ఏమన్నా..?
నాకు వాటి మీద నమ్మకం లేదండీ..జనం చూసి, కళ్యాణ్ రామ్ బాగా చేసాడు అనుకుంటే చాలు.
క్లయిమాక్స్ సీన్ లో హెవీ డైలాగులు వున్నాయని టాక్..డైలాగ్ లు అంటే బాలయ్య, ఎన్టీఆర్ తో కంపారిజన్ వస్తుందేమో?
నేను కూడా భయపడ్డా. పూరి గారు ధైర్యం చెప్పారు. డైలాగ్ బలంగా చెప్పడం కాదు, కావాల్సింది..ఫీల్ తో చెప్పండి. నిజాయతీ ధ్వనించాలి డైలాగ్ లో, ఏక్టింగ్ వద్దు, మీరు నిజాయతీగా ఈ మాటలు చెప్పండి చాలు అన్నారు. అలాగే చేసాను. అన్ని పేజీల డైలాగులు ఎప్పుడూ చెప్పలేదు. ఇదే తొలిసారి.
ఇజమ్ లాంటి సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ సాధ్యమేనా?
ఫస్ట్ హాఫ్ అంతా లైట్ ఎంటర్ టైన్ మెంట్ తోనే వెళ్తుంది. సీరియస్ నెస్ అనేది ఏమీ వుండదు. ఫన్, లవ్, అన్నీ కథలో పార్ట్ గా కలిసి ట్రావెల్ చేస్తూనే వుంటాయి.
మీ మార్కెట్ కు మించి ఖర్చు చేసినట్లున్నారు?
మరీ అని కాదు..కొద్దిగా. అబద్ధం ఎందుకు చెప్పాలి. వున్నమాటే చెబుతున్నా. కాస్త అటు ఇటు ఖర్చు వుండొచ్చు..దాని వల్ల కాస్త చేతికి తగిల్తే తగలొచ్చు. కానీ మన కెరీర్ కోసం, మన కోసం అది పెద్ద మొత్తం కాదు. కానీ ఈ గ్యాసిప్ ల్లో వినిపించేంత అంతకన్నా కాదు. ఇదే కాదు. కళ్యాణ్ రామ్ అయిపోయాడు..అప్పుల్లో మునిగిపోయాడు..అంతా ఊహాగానాలే. అలా అయితే ఈ సినిమా చేయగలనా?
ఇలా ఎన్నాళ్లు స్వంత బ్యానర్ లోనే?
లేదండీ..బయట చేయాలనే నాకు వుంటుంది. డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో ఎవరో మంచి సబ్జెక్ట్ తెస్తారు. నేను టెంప్ట్ అయిపోతాను. స్వంత బ్యానర్ లోకి వెళ్లిపోతాను. సర్లే, ఆయనదే ఆయన చేసుకుంటున్నాడు అనుకుంటారు. అందుకనే, ఇకపై ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెడతాను. నా బ్యానర్ లో సినిమాల కన్నా, బయట సినిమాలు చేయాలని చూస్తాను. అందుకోసం నా టీమ్ కూడా సెట్ చేసుకున్నాను.
పటాస్ లో హీరోయిన్ జర్నలిస్ట్, ఇజమ్ లో హీరో జర్నలిస్ట్..సెంటిమెంటా?
అయ్యో..అలాంటిదేం లేదండీ..ఫ్రాంక్ గా చెబుతున్నా..మీరు అనేదాకా నాకు ఆ పాయింట్ కూడా తట్టలేదు.
సినిమాల సంగతి సరే, రాజకీయాలు వదిలేసారా?
రాజకీయాలు ఎప్పుడూ లేదండీ
అంటే అప్పుడప్పుడు ఎక్కడో అక్కడ కనిపించేవారు కదా?
అదేం లేదండీ..ఇప్పటికీ కలుస్తూనే వుంటాం. కానీ రాజకీయాలు, సినిమా ఇలా రెండు పడవలపై కాళ్లు నావల్ల కాదు.
మరి బాబాయ్ సంగతేమిటి?
ఏముంది..ఎప్పటికీ బాబాయ్ నే. కుటుంబ బంధాలు ఎక్కడికి పోతాయి. అందరం కలుస్తూనే వుంటాం. ఈ మధ్యనే మా ఫ్యామిలీ పార్టీ అయింది. కజిన్స్ అంతా ఒక్క దగ్గర కలిసాం.
మీ బ్యానర్ తో ఎన్టీఆర్ తో సినిమా కన్ ఫర్మ్ నా?
వుంటుంది. కథ, డైరక్టర్ అన్నీ సెట్ కావాలి కదా?
ఓకె అండీ..ఆల్ ది బెస్ట్.
థాంక్యూ
విఎస్ఎన్ మూర్తి