కూట‌మికి అధికారం ఇచ్చింది ఇందుకా?

వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీస్‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నోటీసులు ఇవ్వ‌డంపై వివాదం త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ లాయ‌ర్‌, జై భీమ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. క‌క్ష‌పూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాల‌యాల్ని కూల్చ‌డానికేనా కూట‌మికి అధికారం ఇచ్చింది అని ఆయ‌న నిల‌దీశారు.

టీడీపీ కేంద్ర కార్యాల‌యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాల‌యాల‌కు అనుమ‌తులు వుంటే చూపాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఏవైనా భ‌వ‌నాలు కూల్చాలంటే కేవ‌లం కోర్ట్ ఆర్డ‌ర్‌తోనే కూల్చాల‌న్నారు. అందుకు భిన్నంగా ఇష్ట‌మొచ్చిన‌ట్టు భ‌వ‌నాలు కూలుస్తామంటే కుద‌ర‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఏ పార్టీ అధికారంలో వుంటే అధికారులు ఆ ప్ర‌భుత్వానికి కొమ్ము కాయ‌డం స‌రైంది కాద‌న్నారు.

ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. నాడు త‌న కాలేజీల‌ను మూసేయించార‌నే అక్క‌సుతో, నేడు మంత్రికాగానే నారాయ‌ణ వైసీపీ కార్యాల‌యాల‌ను ప‌డ‌గొడ‌తారా? అని జ‌డ శ్ర‌వ‌ణ్ నిలదీశారు. కోర్ట్ ఆర్డ‌ర్ వుండ‌గానే వైసీపీ సెంట్ర‌ల్ కార్యాల‌యాన్ని ఎలా కూలుస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌ర‌క‌ట్ట‌మీద ఉన్న ఏ బిల్డింగ్‌కు అయినా అనుమ‌తి వుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రెందుక‌ని వాటిని పడ‌గొట్ట‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు.

మంత్రి అచ్చెన్నాయుడు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లంతా ప‌సుపు బిళ్ల వేసుకుని అధికారుల ద‌గ్గ‌రికి వెళ్లాలని చెప్ప‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో గుర్తించారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీని ఎఫెక్ట్ 2029 ఎన్నిక‌ల్లో తెలుస్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. Readmore!

Show comments