ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు ఆ నాయ‌కుడు విమ‌ర్శ‌లు చేశార‌బ్బా!

ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సోము వీర్రాజు చాలా కాలం త‌ర్వాత క‌నిపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అస‌లు ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారా? అనే అనుమానం అంద‌రిలో ఇంత‌కాలం వుంటూ వ‌చ్చింది. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడ్డంతో వీర్రాజు రాజ‌కీయాల్లో ఇంకా కొన‌సాగుతున్నారా? అని అంటున్నారు.

ఏపీ బీజేపీలో రెండు వ‌ర్గాలున్నాయి. టీడీపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలున్నాయి. ఇందులో సోము వీర్రాజు టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గంగా గుర్తింపు పొందారు. అందుకే ఆయ‌న‌కు క‌నీసం ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా రాకుండా టీడీపీ అడ్డుకోగ‌లిగింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మౌనంగానే వుంటూ వ‌చ్చారు. ఇంత‌కాలం ఆయ‌న ఏం చేస్తున్నారో కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బీజేపీలో చేరే ప్ర‌తిపాద‌న‌, ఆలోచ‌న లేనే లేద‌న్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరులో మున్సిప‌ల్ చైర్మ‌న్ టీడీపీలో చేరుతున్న‌ట్టు తెలిసింద‌న్నారు. అయితే ఒక‌రు ఒక పార్టీలో, మ‌రొక‌రు ఇంకో పార్టీలో చేర‌కూడ‌ద‌న్న నిబంధ‌న లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎవ‌రైనా ఏ పార్టీలో అయిన చేర‌వ‌చ్చ‌న్నారు. ఈవీఎంల‌పై వైసీపీ నేత‌లు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. ప్ర‌జాతీర్పును గౌర‌వించాల‌ని వీర్రాజు హిత‌వు ప‌లికారు.

ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం కూడా హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఇంకా అహంకారం పోలేద‌ని వీర్రాజు విమ‌ర్శించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కాంగ్రెస్ నేత‌లు అహంకార ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. Readmore!

Show comments