రామోజీకి రాజ‌గురు ద‌క్షిణ‌

చంద్ర‌బాబుకి గురుభ‌క్తి ఎక్కువ‌. జ‌నం డ‌బ్బుతో రామోజీ సంస్మ‌ర‌ణ స‌భ ఘ‌నంగా చేశారు. భార‌త‌ర‌త్న కూడా ఇవ్వాల‌ని కోరాడు. ప‌నిలో ప‌నిగా ఎన్టీఆర్‌ను కూడా క‌లిపాడు. ఎన్టీఆర్‌కు ఇస్తే ఎవ‌రికీ ఆక్షేప‌ణ వుండ‌దు కానీ, రామోజీ భార‌తర‌త్న ఎలా అవుతాడా? అనేది అంద‌రికీ సందేహం. అయితే వ్యాపార‌ర‌త్న అవుతాడు కానీ. దేశంలో ఎలాగూ వ్యాపారుల చేతుల్లోనే వుంది కాబ‌ట్టి, ఆ లెక్క‌న చూస్తే క‌రెక్టే.

రామోజీ మంచి వ్యాపార‌స్తుడు. ఇక్క‌డ మంచి అంటే మంచివాడ‌ని అర్థం కాదు. సొంత వ్యాపారాల‌ను అభివృద్ధి చేయ‌డం, ప్ర‌త్య‌ర్థుల్ని తొక్క‌డం, ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేయ‌డం, స్వార్థం త‌ప్ప‌, మాన‌వ ముఖం లేక‌పోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. చంద్ర‌బాబుకి అదే కావాలి. పైగా బాబు ఈనాటి స్థితికి రామోజీ ఊత‌క‌ర్ర లాంటి వాడు.

తెలుగు వాళ్ల దుర‌దృష్టం ఏంటంటే గ‌త 40 ఏళ్లుగా ఈనాడు త‌ప్ప ఇంకో ప‌త్రిక‌ని స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌వారు లేక‌పోవ‌డం. వ‌చ్చినా రామోజీ స్పీడ్‌కి, ఎత్తుల‌కి త‌ట్టుకోలేక‌పోవ‌డం. నిజాలు రాస్తే ప‌త్రిక‌లు అమ్ముడుపోవు. అమ్మ‌కం క‌ళ కూడా తెలియాలి. ఉద‌యం రావ‌డం బాగానే వ‌చ్చింది కానీ, దాస‌రికి సినిమా తెలిసినంత బాగా వ్యాపారం తెలియ‌దు. అంద‌రినీ న‌మ్మాడు, మునిగాడు. రామోజీ గొప్ప‌త‌నం ఏమంటే ఎవ‌రినీ న‌మ్మ‌డు. ప్ర‌తివాడి మీద నిఘా వుంటుంది. వేగుల మీదే వేగుల్ని నియ‌మించ‌డంలో స‌మ‌ర్థుడు. అబ‌ద్ధాల్ని నిజాలుగా భావింప‌చేసే మంత్ర‌గాడు.

దాస‌రి చేతులెత్తేస్తే, మాగుంట కొన్నాడు. సారా ఉద్య‌మంతో ఆయ‌న వ్యాపారంతో పాటు ప‌త్రిక కూడా ఫినిష్. వార్త పేరుతో సంఘీ వ‌చ్చాడు. మార్వాడి వ్యాపార‌స్తుడు, రామోజీకి స‌రైన వాడే కానీ , బ‌ట్ట‌ల మిల్లుకి, పేప‌ర్ ఆఫీస్‌కి తేడా తెలియ‌దు. రెండు తానులుగానే వ‌స్తాయ‌నుకున్నాడు. Readmore!

రామోజీ జూద నిర్వాహ‌కుడులాంటి వాడు. అవ‌త‌లి వాడు దివాళా తీసే వ‌ర‌కూ ఆడ‌గ‌ల‌డు. జిల్లా పేజీల్ని క‌ల‌ర్స్ స్పెష‌ల్స్ అంటూ ఖ‌ర్చు పెంచాడు. అవ‌త‌ల కూడా పోటీ ప‌డి చేతులెత్తేశారు.

ఒక అబ‌ద్ధాన్ని ప‌దేప‌దే చెబితే నిజంగా మారుతుంది, ఇది ఈనాడు పాల‌సీ. చంద్ర‌బాబు గొప్ప నాయ‌కుడు, దార్శ‌నికుడు అని ప్ర‌చారం చేసింది. బాబు ప‌డిన‌ప్పుడ‌ల్లా పంపు కొట్టి నిల‌బెట్టింది. అయినా 2004లో ఓడిపోయాడు.

వైఎస్‌కి రాజ‌కీయం తెలుసు కానీ, వ్యాపారం తెలియ‌దు. జ‌గ‌న్ వ్యాపారం నేర్చుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. చంద్ర‌బాబు బ‌లం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి అని గుర్తించాడు. సాక్షి పుట్టింది. ఏబీసీ (ఆడిట్ బ్యూర్ ఆఫ్ స‌ర్క్యులేష‌న్‌) చేజారి పోతుంద‌ని రామోజీని భ‌య‌ప‌డేలా చేసింది. అయితే వైఎస్ అనంత‌రం అది జెమినీ ప్రొడ‌క్ష‌న్ లోగోలా మారిపోయింది. ఇద్ద‌రు కుర్రాళ్లు బాకాలు ఊదిన‌ట్టు సాక్షి ప‌త్రిక , టీవీలు జ‌గ‌న్‌కి బాకాలుగా మారిపోయాయి.

సాక్షి మేనేజ్‌మెంట్ ఎంత నాణ్యంగా త‌యారైందంటే వాళ్ల‌కి రాత‌కి, కోత‌కి తేడా తెలియ‌దు. రాసే వాళ్ల‌కి కుంటి స్టూల్‌, కోత‌లు కోసే వాళ్ల‌కి కుష‌న్ సీట్‌.

ఈనాడు స‌క్సెస్‌కి, రామోజీ గొప్ప‌త‌నానికి కార‌ణం అవత‌లి వాళ్ల చేత‌కానిత‌నమే. గురువుల్ని ప‌ట్టించుకునే ల‌క్ష‌ణం చంద్ర‌బాబుకి లేదు. కానీ రామోజీకి వార‌స‌త్వం వుంది. ఈనాడు ఇంకా నెంబ‌ర్ 1గానే వుంది. ఈ ఐదేళ్లు చంద్ర‌బాబు ఏం చేసినా అద్భుతం అన‌డానికి సిద్ధంగా వుంది. జ‌గ‌న్‌ని ఓడించే పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో తాను విజ‌యం సాధించి, బాబుకి కూడా తెచ్చింది.

ఈ నేప‌థ్యంలో రాజ‌గురు ద‌క్షిణ చెల్లించ‌డం ధ‌ర్మ స‌మ్మ‌తం. అందుకే ప్ర‌జ‌ల సొమ్ముతో ప్ర‌క‌ట‌న‌లు, స‌భ‌లు. ఎన్టీఆర్ చ‌నిపోయి 28 ఏళ్లైనా భార‌త‌ర‌త్న‌కు దిక్కులేదు కానీ, రామోజీ చ‌నిపోయిన 20 రోజుల‌కే భార‌త‌ర‌త్న‌ని ప్ర‌స్తావిస్తున్నారు.

తెలుగు స‌మాజానికి రామోజీ ఇచ్చిన కానుక చంద్ర‌బాబు. రామోజీకి చంద్ర‌బాబు ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ది భార‌త‌ర‌త్న‌. లెక్క స‌రిపోయింది.

Show comments