గులాబీ బాస్​కు అండగా నిలవని హైకోర్టు

గులాబీ బాస్ కేసీఆర్​ తాను ఎవ్వరికీ భయపడనని చెప్పకుంటూ ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో తాను చావుకే భయపడలేదంటాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని ప్రచారం చేసుకుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఈడీకి, సీబీఐకి భయపడేది లేదన్నాడు. ఈడీ. .బోడీ తనను ఏం చేయలేవన్నాడు.

అలాంటి కేసీఆర్​ ఇప్పుడు కరెంటు కొనుగోళ్లపై, విద్యుత్​ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరుపుతున్న నరసింహారెడ్డి కమిషన్​ ఎదుట హాజరుకావడానికి భయపడుతున్నాడు. కమిషన్​ నోటీసులు ఇవ్వగానే దానికి తనను విచారించే అధికారం లేదని మండిపడ్డాడు. ఈ కమిషన్​ ఏర్పాటే చట్టబద్ధం కాదని, నరసింహారెడ్డి తప్పుకోవాలని అన్నాడు. కమిషన్​ ఎదుట హాజరు కానని చెప్పాడు. 

తాను చేసిందంతా సరైందేనంటూ సమర్థించుకొని కమిషన్​కు 12 పేజీల ఉత్తరం రాశాడు. దాన్ని మీడియాకు విడుదల చేశాడు. హైకోర్టులో పిటిషన్​ వేశాడు. అవే విషయాలు చెప్పాడు. కాని హైకోర్టు కేసీఆర్​ వాదనతో ఏకీభవించలేదు. కమిషన్​ ఎదుట హాజరై చెప్పాలనుకున్నది చెప్పొచ్చు కదా అని ప్రశ్నించింది. విచారణ కమిషన్​ రిపోర్టుపై అసెంబ్లీలో వివరణ ఇవ్వొచ్చు కదా అని చెప్పింది. దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకని, ఇంత గాయిగత్తర లేపడం ఎందుకన్నట్లుగా హైకోర్టు అక్షింతలు వేసింది.

పిటిషన్​పై విచారణలో ఈ రోజు కూడా అలాగే చెబుతుండవచ్చు. కేసీఆర్​ నరసింహారెడ్డి కమిషన్​నే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారిస్తున్న పినాకీ చంద్రఘోష్​ కమిషన్​ను కూడా ఫేస్​ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్​ విచారణకు హాజరుకాకపోతే ఎలా రప్పించాలో తమకు తెలుసని ఆయన ఇది వరకే చెప్పారు. కేసీఆర్​ దాని ఎదుట కూడా హాజరై అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. Readmore!

విద్యుత్​ కొనుగోళ్ల విచారణకు అప్పటి విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డిని, కాళేశ్వరం విచారణకు ఇరిగేషన్​ మంత్రిగా పనిచేసిన హరీష్​రావును కూడా పిలుస్తారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కూడా కేసీఆర్​ ప్రమేయం ఉంది కాబట్టి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాను అన్నింటికీ అతీతుడినని అనడానికి వీలులేదు. విచారణ కమిషన్లకు సర్వాధికారాలు ఉంటాయన్న విషయం కేసీఆర్​కు తెలియంది కాదు.

Show comments