నాగ్ అశ్విన్ ఒక క్రియేటివ్ జీనియ‌స్‌

క‌ల్కి సినిమా గురించి చెప్ప‌డానికి ముందు మ‌నిషి గురించి చెప్పాలి. మ‌నిషి గొప్ప‌త‌నం ఏమంటే ఏం కావాలో, ఎంత కావాలో తెలియ‌క‌పోవ‌డం. అన్నం ద‌గ్గ‌ర త‌ప్ప ఇంకెక్క‌డా అత‌ను "ఇక చాలు" అన‌డు. ప‌ది రోజుల తిండిని క‌డుపులో సంర‌క్షించుకునే అవ‌కాశ‌మే వుండి వుంటే ఒకేసారి అత‌ను 20 రోజుల తిండిని తినేసే వాడు.

జంతువు నుంచి మ‌నిషి బ‌య‌టికి వ‌చ్చాడ‌ని డార్విన్ అనుకున్నాడు కానీ, మ‌నిషి అనుకోలేదు. అమీబా కంటే వింత జీవి. ఎపుడు ఏ రూపంలో వుంటాడో అత‌నికి కూడా తెలియ‌దు.

ఒక మ‌నిషిలో ఇద్ద‌రుంటార‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటారు కానీ, ఇద్ద‌రు కాదు 22 మంది వుంటారు. న‌వ‌ర‌సాలు ఏక‌కాలంలో వుంటాయి. జీవితం అశాశ్వ‌త‌మ‌ని ఒక‌డు మేక‌కు బోధిస్తూ వుంటాడు. హాస్యం అన్నిటికి ఔష‌ధ‌మ‌ని న‌వ్వ‌ని వాళ్ల‌ని ఇంకొక‌డు చావ‌బాదుతూ వుంటాడు.

తాచు పాముని పూల జ‌డ‌గా న‌మ్మించే శ‌క్తిమంతుడు. అయినా మ‌నిషి మార‌లేదు అనేది పాట కాదు, సారాంశం. Readmore!

క‌ల్కి సినిమా చూస్తే 874 ఏళ్ల త‌ర్వాత కూడా మ‌నుషులు మార‌ర‌ని అర్థ‌మైంది. పేద‌, ధ‌నిక ప్ర‌పంచాలు. ఒక తిరుగుబాటు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విజ‌న్ మ‌నిషి మూలాల్ని మ‌రిచిపోలేదు.

కాశీ న‌గ‌రంలో ఆక‌లి, పేద‌రికం, నీళ్లు లేవు. మంచి గాలి కూడా వుండ‌దు. బాగా డ‌బ్బులుంటే కాంప్లెక్స్‌కి వెళ్లొచ్చు. మ‌న పిల్ల‌లు ఇపుడు అమెరికా వెళ్లి జీవితాన్ని వెతుక్కున్న‌ట్టు కాశీ నుంచి కాంప్లెక్స్‌కి ప్ర‌యాణం. హీరో భైర‌వ ఆ ప్ర‌య‌త్నంలోనే వుంటాడు. అత‌నికి ఏ ఎమోష‌న్స్ వుండ‌వు. స్వార్థం ఒక్క‌టే ఎమోష‌న్‌. భావోద్వేగాల సంఘ‌ర్ష‌ణ లేక‌పోవ‌డం ఈ సినిమా లోప‌మ‌ని మొద‌ట్లో అనిపించింది. కానీ , ద‌ర్శ‌కుడి ఆలోచ‌నే క‌రెక్ట్‌. 2024లోనే ఏ ఎమోష‌న్స్ లేకుండా అంతా నాకే కావాలి అంటూ స్వార్థానికి చిరునామాల జీవిస్తూ వుంటే 2898లో మ‌నిషి ఇంకెంత క‌రుడు క‌ట్టి వుంటాడు.

సుమ‌తి (దీపిక‌)లో కూడా ఏ ఉద్వేగం లేక‌పోవ‌డానికి ఇదే కార‌ణం. మాతృత్వం ఆమెకి స‌హ‌జ సిద్ధం కాదు. ప్రేమ ఆమెని త‌ల్లి చేయ‌లేదు. అందుకే ఆమె గంద‌ర‌గోళంగా వుంటుంది. త‌న కోసం, త‌న చుట్టూ ఏం జ‌రుగుతూ వుందో అర్థం కాదు. బిడ్డ తొలిసారి క‌దిలిన‌ప్పుడే ఉద్వేగం, మాతృత్వ భావ‌న‌.

క‌మ‌ల‌హాస‌న్ ఒక గ్రాఫిక్స్ విల‌న్‌. ఆయ‌న దృష్టిలో మ‌నిషి అంటే సంప‌న్నుడే. పేద‌వాడిని ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌డు. డ‌బ్బున్న వాళ్ల కోసం స‌మ‌స్త సౌక‌ర్యాలు, సౌంద‌ర్యాలు సృష్టించాడు. డ‌బ్బు క‌డితే కాంప్లెక్స్‌లోకి ప్ర‌వేశం. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీ లాంటిది.

డ‌బ్బు సంపాదించి, కాంప్లెక్స్ క‌మ్యూనిటీ లోకి చేరాల‌ని హీరో ల‌క్ష్యం. హీరోయిన్‌ని విల‌న్‌కి ప‌ట్టించే ప్ర‌య‌త్నం కూడా ఇదే. నిజానికి దీపికాని హీరోయిన్ అన‌డానికి వీల్లేదు. ప్ర‌భాస్ కూడా హీరో కాదు. సినిమాలో ఎక్క‌డా కూడా అత‌నికి ఉదాత్త భావాలుండ‌వు. ఎనిమిది శ‌తాబ్దాల త‌ర్వాత మంచీచెడులకి అర్థం వుండ‌క‌పోవ‌చ్చు. దీపిక హీరోయిన్ ఎందుకు కాదంటే ఆమెకి హీరోతో ఏ అటాచ్‌మెంట్ ఉండ‌దు.

ఇక హీరో ఎవ‌రంటే అశ్వ‌థ్థామ (అమితాబ్‌). అత‌ను పాత‌కాలం వాడు కాబ‌ట్టి ఎమోష‌న్స్ వుంటాయి. 8 అడుగుల ఎత్తుతో ఎంత‌టి వాడినైనా చిత్తు చేస్తాడు. సినిమాకి ఆక‌ర్ష‌ణ ఈ క్యారెక్ట‌రే. హీరోయిన్ క‌డుపులో శిశువుని కాపాడ్డానికి (దేవుడు లేదా క‌ల్కి) స‌ర్వ శ‌క్తులు వినియోగిస్తాడు. ర‌క్షించేవాడే నాయ‌కుడ‌నే సూత్రం ప్ర‌కారం సినిమాకి అశ్వ‌థ్థామే ర‌క్ష‌ణ‌.

అన్ని కాలాల్లోనూ మ‌నిషి ప‌త‌న‌మైన‌ప్పుడు, ధ‌ర్మం క్షీణించిన‌ప్పుడు దేవుడు ఒక అవ‌తారంలో వ‌స్తాడు. అత‌నే క‌ల్కి. వ‌స్తాడో రాడో తెలియాలంటే క‌ల్కి-2 చూడాలి.

మొద‌టి అర‌గంట సినిమా స్లోగా వున్న‌ప్పుడు గ్రాఫిక్స్‌పై ఎన‌ర్జీనంతా కేంద్రీక‌రించి , క‌థ రాసుకోవ‌డంలో నాగ్ అశ్విన్ త‌డ‌బ‌డ్డాడేమో అని అనుమానం వ‌చ్చింది. అత‌ను క‌రెక్ట్‌గానే రాసుకున్నాడు. మ‌న‌మే జాగ్ర‌త్త‌గా చూడాలి.

నాగ్ అశ్విన్ ఒక క్రియేటివ్ జీనియ‌స్‌. నారికేళ‌పాకం. కొంచెం క‌ష్ట‌ప‌డితే ఆ మాధుర్యం వేరు.

జీఆర్ మ‌హ‌ర్షి

Show comments