నోటితో చెప్పేదొకటి.. చేత్తో చేసేదొకటి!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. వేదిక ఎక్కిన ప్రతిసారీ.. కక్ష సాధింపులు ఉండవు.. తమ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉండబోతున్నది.. వైసీపీ వారి మీద ఎలాంటి వేధింపులు ఉండవు అంటూ చిలకపలుకులు పలుకుతూ ఉంటారు. కానీ ఆచరణలో వచ్చేసరికి ఒక్కొక్కటి నెమ్మదిగా లెక్క సెట్ చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం ఆల్రెడీ మొదలైన వ్యవహారం కాగా, ఇప్పుడు.. వైసీపీ నాయకుల మీద పడినట్టుగా కనిపిస్తోంది.

గత ప్రభుత్వం హయాంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి అప్పట్లో నమోదైన కేసులు, వాటి పురోగతి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అనే విషయమైన వివరాలు ఇవ్వాలని పోలీసు శాఖను సీఎంవో ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో జరిగిన రాజకీయ వేధింపులకు సంబంధించి ప్రస్తుతం స్టేటస్ ఇవ్వాలని సీఎంవో ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులు వైసీపీ వారిపై నమోదైన పాత కేసుల బూజు దులుపుతున్నారు.

గతంలో చంద్ర బాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన కేసులను ముందు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పట్లో చంద్రబాబు నివాసం మీద దాడిచేసిన కేసులో వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ మీద కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు ఇంటి మీదికి ఎగబడి దాడి చేసినందుకు, బూతులు తిట్టినందుకే జోగి రమేష్ పెర్ఫార్మెన్స్ మెచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత‌ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

ఈ కేసుతో పాటు కొల్లు రవీంద్రపై అక్రమంగా హత్యకేసు బనాయించి వేధించారనే విషయంలో కూడా అప్పట్లో పేర్ని నానిపై ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు లోడుతున్నారని.. పేర్ని నానిపై చర్యలకు ఉపక్రమిస్తారని కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాగే.. ఉద్యోగసంఘాల నేత సూర్యనారాయణ కూడా తనను దొరికితే చాలు హత్య చేయాల్సిందిగా సజ్జల రామక్రిష్ణారెడ్డి పురమాయించారంటూ ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. వీటన్నింటి మీద కూడా పోలీసులు దృష్టి సారించేలా సీఎంవో నుంచి ఆదేశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. Readmore!

అయితే ఇవన్నీ మామూలు విషయాలే అని.. వీటిని కక్ష సాధింపు అనడానికి వీల్లేదని తెలుగుదేశం నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారేమో తెలియదు.

Show comments