అధిష్టానానికి తలనొప్పిగా మారిన షర్మిల

కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ ఏపీ పీసీసీ నేత షర్మిల వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఏక పక్షంగా నిర్ణయాలు, సీనియర్ నేతలను సంప్రదించకపోవడం, సర్వేల పేరుతో ఇష్టారాజ్యంగా అభ్యర్థుల ఎంపికలు, తెర వెనుక వసూళ్ల గురించి ఢిల్లీకి సమాచారం అందింది.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం థాగోర్ తమిళనాడు ఎన్నికల్లో బిజీగా ఉండడంతో షర్మిల తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల తర్వాత ఆమె సంగతి చూస్తానని మాణిక్కం రాష్ట్ర నేతలకు చెబుతున్నట్లు సమాచారం.

రఘువీరారెడ్డి, రుద్రరాజు, సుంకర పద్మశ్రీ లాంటి నేతలను ఆమె బేఖాతరు చేస్తున్నారు. దీనితో వారు ఆమెకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కెవిపి కూడా తానేమీ చేయలేనని నేతలకు చెబుతున్నట్లు తెలిసింది. వైసీపీ నుంచి ఎవరూ పట్టించుకోని సాదాసీదా నేత వచ్చినా షర్మిల వారికి పెద్ద పీట వేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అసలు మీకు అంత సీన్ లేదు అని షర్మిల ఒక సీనియర్ నేతతో అనడంతో ఆయన హతాశుడైనట్లు తెలిసింది. షర్మిల వల్ల రాష్ట్ర కాంగ్రెస్ కు పెద్ద లాభం లేదని రాహుల్ గాంధీకి అంతర్గత వర్గాలు చెప్పినట్లు తెలిసింది. 

 

Show comments