ఉచితంగా ఏసీ బస్సులో ప్రయాణం

హైదరాబాద్ నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే తడిసిమోపెడవుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఏసీ బస్సులో ప్రయాణం చేయాలంటే అటుఇటుగా 3వేల రూపాయలు ఖర్చు.

ఈ ఎన్నికల వేళ, వేసవి సీజన్ లో ఏసీ బస్సు ప్రయాణమంటే ఇంకాస్త ఎక్కువ చేతి చమురు వదలడం గ్యారెంటీ. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా చల్లగా ఏసీ బస్సులో సొంతూరు వెళ్లే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.

ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే వీళ్ల ఓటు హక్కులు మాత్రం ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లందరికీ పార్టీలు గాలం వేస్తున్నాయి. సొంతూరు వచ్చి తమ పార్టీకి ఓటు వేయాలంటూ ఉచితంగా బస్సు టికెట్లు అందిస్తున్నాయి.

హైదరాబాద్ లో చాలామందికి ఇప్పటికే టికెట్లు అందాయి. సోమవారం పోలింగ్, లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. దీంతో చాలామంది సొంతూళ్లకు ప్రయాణం కట్టారు. పైగా ఫ్రీ జర్నీ కూడా కావడంతో ఎవ్వరూ తగ్గడం లేదు.

Readmore!

ఎన్నికల వేళ తాయిలాల కార్యక్రమం జోరుగా నడుస్తోంది. డబ్బుల పంపిణీతో పాటు, గిఫ్టులిచ్చే కార్యక్రమం తెరవెనక కొనసాగుతూనే ఉంది. ఓటర్ల డిమాండ్ మేరకు కొన్ని చోట్ల చిన్నచిన్న బంగారు ఆభరణాలు, మరికొన్ని చోట్ల ఏసీలు లాంటివి కూడా అభ్యర్థులు కొనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఓటర్లను పోలింగ్ కు రప్పించేందుకు ఉచిత ఏసీ బస్సు టికెట్లను కూడా అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్నారు.

Show comments