శ్రీభ‌ర‌త్ కూ చంద్ర‌బాబు చేతిలో నంద‌మూరి అనుభవాలేనా?

చంద్ర‌బాబు నాయుడు త‌న అవ‌స‌రానికి వాడుకోవ‌డం విష‌యంలో ఎవ‌రి విష‌యంలోనూ మొహ‌మాటప‌డ‌రు! అలాగే ఎవ‌రిని ఎక్క‌డ తొక్కాలో కూడా చంద్ర‌బాబుకు మ‌హ‌బాగా తెలుస‌నేది చ‌రిత్ర చెబుతున్న విష‌యం! సొంత‌వాళ్లు ప‌ద‌వులు అడిగినా, టికెట్లు అడిగినా ఆయ‌న సూటిగా నో చెప్ప‌రు! వారికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే ఇచ్చి తొక్క‌డం చంద్ర‌బాబు అల‌వాటు! ఇప్పుడు విశాఖ నుంచి టీడీపీ కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న శ్రీ భ‌ర‌త్ ప‌రిస్థితి కూడా ఇదేన‌నే టాక్ విశాఖ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది! 

భ‌ర‌త్ తో త‌న త‌న‌యుడు లోకేష్ కు లేనిపోని త‌ల‌నొప్పి ఉంటుంద‌నేది చంద్ర‌బాబు లెక్క‌! గ‌తంలో త‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించిన చంద్ర‌బాబుకు ఇప్పుడు త‌న త‌న‌యుడు తోడ‌ల్లుడు భ‌ర‌త్ కు అదే గ‌తి ప‌ట్టించ‌డం చంద్ర‌బాబుకు సునాయాసం అనే చెప్పాలి!

సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు...ఆ తర్వాత నందమూరి వంశంలో ఎవరినీ కూడా పార్టీలోకి రానివ్వలేదు. ఎదగనివ్వలేదు.  తెలుగుదేశం పార్టీలోకైతే ఎవ‌రినీ అడుగుపెట్టనివ్వలేదు.

దీనికి బలమైన కారణం ఏమిటంటే...ఎవరినైనా పార్టీలో పెట్టుకుంటే, తనకి ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారోననే భయమే, పార్టీలోకి ఎవరినీ రప్పించలేదని అంటారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో పిలిచి కేంద్ర మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఒప్పుకోలేదు. మళ్లీ ఢిల్లీలో కేంద్ర మంత్రులు గ్రూపులు పెడితే, అసలుకే మోసం వస్తుందని భయపడి వద్దని అనేశాడు. దాంతో వాజ్ పేయి ఎంతో అభిమానంతో స్పీకర్ పదవినిస్తే, దానిని నోరులేని నాటి ఎంపీ బాలయోగికి ఇప్పించాడు.

Readmore!

నందమూరి వంశం తెరచి ఉంచిన పుస్తకం. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఎక్కడా అతిశయోక్తులు లేవు.  ఇప్పుడు భ‌ర‌త్ ప‌రిస్థితిని చూశాకా విశాఖ స్థానికులు గ‌త ప‌రిణామాల‌ను గుర్తు చేసుకుంటున్నారంతే!  ఎన్టీఆర్ కు రాజ‌కీయ వార‌సుడు అనిపించుకున్న హ‌రికృష్ణ విష‌యంలోనే చంద్ర‌బాబు అన్నీ ఇన్నీ రాజ‌కీయాలు చేయ‌లేదు! ఎన్టీఆర్ చైత‌న్య ర‌థ‌సార‌ధి అయిన హ‌రికృష్ణ‌కు త‌న తండ్రి అనంత‌రం టీడీపీలో స్థాన‌మే లేకుండా పోయింది! అయితేనేం నేడు తెలంగాణలో ఎంతో మంది తెలుగుదేశం నేతలకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అయినా, సీట్లు ఇచ్చింది మాత్రం హరికృష్ణ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటివారిలో నేటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు.

ఆ కృత‌జ్ఞ‌త‌తోనే హరికృష్ణ మరణిస్తే, అధికార లాంఛనాలతో తనకి అంత్యక్రియలు జరిపించారు. హ‌రికృష్ణ‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపిన ప‌రిస్థితుల్లోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పార్టీలోంచి గెంటేశారు. ఆయన భార్య పురందేశ్వరిని గెంటేశారు. అప్పుడే వారు రోడ్డుమీద పడి, చంద్రబాబుని శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా పురంధేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.

అనంతరం నందమూరి తారకరత్న కూడా సినిమాల్లో ఫెయిల్ అయ్యాక రాజకీయాల్లోకి వద్దామని చూస్తే బలవంతంగా ఆపించారని అంటారు. అప్పట్లో తన స్పీచ్ లు చాలా ప్రభావంతంగా ఉండేవి. మెచ్యూర్డుగా ఉండేవి. తర్వాత కాలంలో లోకేష్ కి సలహాదారుగా రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే కన్నుమూశాడు. 

అంతకుముందు హరికృష్ణ కుమార్తెకు కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా సీటు ఇచ్చారు. ఆంధ్రా విభజన తర్వాత తెలంగాణలో పార్టీకి సీన్ లేని తర్వాత ఆమె ఎలా గెలుస్తారని సీటు ఇచ్చారని కూడా అంటారు. హ‌రిపై అంత అభిమానం ఉంటే, ఆ ఇచ్చేదేదో ఆంధ్రాలో ఇవ్వచ్చు కదా అనే డిమాండ్లు వినిపించాయి.

ఇదిలా ఉండగా... వీళ్లందరినీ దాటుకుని నందమూరి వంశం బంధువుగా ఇప్పుడు శ్రీ భరత్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా సీటు సంపాదించాడు. 2019లో కూడా పోటీ చేసిన శ్రీ భరత్ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో 2024లో కూటమితో జట్టు కట్టి, విశాఖను బీజేపీ ఖాతాలో చంద్రబాబు  పడేశాడనే విమర్శలు వచ్చాయి. అయితే పట్టువదలని శ్రీ భరత్ మొత్తానికి సీటు తెచ్చుకున్నాడు.

చంద్రబాబు వారసుడిగా లోకేషు రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నాడు. ఇప్పుడదే వయసున్న శ్రీ భరత్ ఎన్నో రెట్లు లోకేష్ కన్నా బెటర్ అని అందరూ అంటున్నారు. రేపు ఎన్నిక‌ల్లో లోకేష్ ఓడితే.. అప్పుడు భ‌ర‌త్ లాంటి వాళ్లు కూడా మేకు అవుతార‌నే భ‌యాలు చంద్ర‌బాబుకు స‌హ‌జంగానే ఉంటాయి. వాటితోనే చాలా మందిని ఆయ‌న పార్టీ నుంచి త‌రిమేశారు! ఈ నేప‌థ్యంలోనే శ్రీ భరత్  గెలవకుండా ఆపేందుకు తెరవెనుక తతంగాలన్నీ జరుగుతున్నాయని కూడా అంటున్నారు. అల్టిమేట్ గా చంద్ర‌బాబు వ్యూహాలు విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఝాన్సీకి సానుకూలంగా మారే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తూ ఉన్నాయి!

Show comments