హరి హర డబ్బులు వెనక్కు ఇచ్చేస్తారా?

టాలీవుడ్‌లో ఓ భేతాళ ప్రశ్న వుంది. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లోని హరి హర వీరమల్లు సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది అన్నదే ఆ ప్రశ్న. దీనికి ఆ విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడు. అసలు దీని గురించిన వార్తలే చిరకాలంగా లేవు. ఓజి అంటారు.. ఉస్తాద్ అంటారు.. కాదంటే మరో సినిమా కూడా సెట్ అవుతోందంటారు. అంతే తప్ప హరి హర సంగతి ఎక్కడా వినిపించడం మానేసింది. ఇలా జరిగి చాలా కాలం అయింది.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే పాజిటివ్ గా కాదు. నెగిటివ్ గా. హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, అనుష్క హీరోయిన్గా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నారని వార్తలు గుప్పు మన్నాయి. ఈ వార్తలను ఎవ్వరూఖండించలేదు సరి కదా మరో వార్త వినిపించడం మొదలైంది. నిర్మాత ఏ ఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాను పూర్తి చేస్తారని వార్తలు వచ్చాయి.

2019 లో ఎన్టీఆర్ మీద రెండు భాగాలు సినిమా తీసాక క్రిష్ ఈ సినిమా మీదకు వచ్చారు. మధ్యలో పాపం, ఓ చిన్న సినిమా తీసారు. మిగిలిన దాదాపు అయిదేళ్లు హరి హర ను నమ్ముకునే వున్నారు. ఇప్పుడు తప్పుకున్నారు అంటే ఇక ఆ సినిమా వుండదనే నిరాశ వచ్చి వుండాలి. లేదూ అంటే తప్పుకోరు కదా.

ఈ సినిమాను పక్కన పెట్టి పవన్ వేరే వేరే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అందువల్లే ఇక క్రిష్ కు క్లారిటీ వచ్చి వుంటుంది. అప్పటికే పవన్ అడిగిన మేరకు పాటలు, ఫైట్లు తగ్గించి స్క్రిప్ట్ మార్చారని వార్తలు వినిపించాయి. అయినా పవన్ ఈ ప్రాజెక్ట్ మీదకు రావడం లేదంటే ఇక చేసే ఉద్దేశం లేదని అర్థం అయిపోయి వుండాలి.

ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా వున్నారు. అధికారంలోకి వస్తామని ధీమాగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు అయ్యాక కేవలం ఓజి మాత్రం పూర్తి చేస్తారని, మిగిలిన ప్రాజెక్ట్ లు అప్పటి పరిస్థితిని బట్టి చేయడం, మానడం వుంటుందని వినిపిస్తోంది.

అలా చేయలేని పరిస్థితి వస్తే ఎఎమ్ రత్నం పెట్టుబడి వెనక్కు ఇస్తారనే గ్యాసిప్ వినిపిస్తోంది. ఏనాడో ఇచ్చిన అడ్వాన్స్, మూడు నాలుగేళ్లుగా తీసిన ఫుటేజ్, పెట్టిన పెట్టుబడి, ఇదంతా కలిపి ఎన్ని కోట్లు వుంటుందో రత్నం కే తెలియాలి. మరి అంత మొత్తం వెనక్కు ఇస్తారా అన్నది చూడాలి.

ఇదిలా వుంటే ఒక వేళ పవన్ సినిమాలు చేయకపోతే కనుక ఒప్పుకున్న మిగిలిన మరో ప్రాజెక్ట్ డబ్బులు కూడా వెనక్కు ఇస్తారని వినిపిస్తోంది. ఆ సినిమాకు పెద్దగా షూటింగ్ జరగలేదు. అందువల్ల అడ్వాన్స్ మరి కాస్త కలిసి ఇస్తే సరిపోతుందేమో.

మొత్తం మీద పవన్ సినిమాల భవిష్యత్ తేలాలంటే ఎన్నికలు పూర్తి కావాలి.

Show comments

Related Stories :