పాపం మాయ: దళితరత్నానికి ఇదేం కష్టం!

వాస్తవాలు మాట్లాడుకుంటే… యూపీలో మాయవతిది అంత దారుణమైన పరాజయం కాదు. ఈ ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచే ఆమె పై మీడియా చెలరేగిపోయింది. ఆమె, ఆమెపార్టీ అసలు పోటీలోనే లేదన్నట్టుగా మీడియా కథనాలు వండి వార్చింది. పోటీ అంతా.. బీజేపీ కి సమాజ్ వాదీ కూటమికి మధ్యనే అన్నట్టుగా మీడియా వార్తలు రాసుకొచ్చింది. అసలు యూపీలో  ఐదారుసీట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ వృద్ధ షీలా దీక్షిత్ ను సీఎం కేండిడేట్ గా ప్రకటించి హడావుడి చేస్తే.. దాని గురించి విపరీతమైన కవరేజ్ ఇచ్చింది మీడియా. షీలా ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఏదో అద్భుతం చేస్తుందన్నట్టుగా మీడియా రాసుకొచ్చింది.

ఆఖరికి కాంగ్రెస్ సాధించిన దాన్ని చూస్తుంటే.. దీనికా ఇంత హడావుడి చేసింది? అనే భావన కలుగుతుంది. మరి ఇదే మీడియా మాయావతి విషయంలో మాత్రం చాలా దారుణంగా వ్యవహరించింది. అసలు మాయ పోటీలోనే లేదన్నట్టుగా.. వ్యవహరించింది. మాయ ప్రభావం అంతంత మాత్రమే.. అని అనునిత్యం వ్యాఖ్యానిస్తూ మీడియా తన పైత్యాన్ని చాటుకుంది. 

మరి చివరకు ఏం జరిగింది? అవును.. మాయ నిజంగానే పోటీలో నిలవలేదు. కేవలం ౧౧ సీట్లకు పరిమితం అయ్యింది. అంతేనా? మాయ గురించి మాట్లాడుకోవడానికి మరేం లేదా? అంటే.. అంతకు మించిన పొరపాటు లేదు. ఏకంగా ౨౨ శాతం ఓట్లను పొందింది బీఎస్పీ. త్రిముఖ పోరు జరిగి యూపీలో ౨౨ శాతం ఓట్లు అంటే.. అది మామూలు విషయం కాదు. సంచలన విజయం సాధించిన బీజేపీ నలభై శాతం ఓట్లను సంపాదించుకుంది. కేవలం పంతొమ్మిది సీట్లకు పరిమితం అయిన మాయ కు 22 శాతం ఓట్లు వచ్చాయి! కోట్ల మంది ఓటర్ల మద్దతు లభించింది. అయితే ఓట్ల శాతం కన్నా.. మాయ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్య తక్కువ కావడం విషాదకరం.

ఈ ప్రజాస్వామ్య విచిత్రం ఏమిటంటే.. 2007 లో మాయవతి అధికారంలోకి వచ్చినప్పుడు దక్కిన ఓట్ల శాతం 29.  ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో అధికారం దక్కింది, 22 శాతం ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ ఓట్లకు ఏ మాత్రం విలువ లేకుండా పోయింది.

ఇదీ పరిస్థితి. ఈ ఎన్నికల్లో ఎస్పీకి దక్కిన ఓట్ల శాతం కూడా బీఎస్పీ కన్నా తక్కువే! ఎస్పీకి సోలోగా దక్కిన ఓట్ల శాతం కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు దక్కాయి. అయితే ఎస్పీ  మూడువందల చిల్లర స్థానాల్లోనే ఆ ఓట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ తో జతకలిసి ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది. దళితరత్నం మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఇప్పుడు కనీసం తన రాజ్యసభ సభ్యత్వాన్ని నిలుపుకోలేని స్థితిలో పడిపోయింది.

త్వరలోనే మాయావతి రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. ప్రస్తుతం యూపీలో ఆమె పార్టీకి దక్కిన సీట్లను బట్టి చూస్తే.. ఆమె తిరిగి రాజ్యసభకు ప్రవేశించడం కూడా కష్టమే. మరి మాయవతి రిటర్న్స్… వచ్చే లోక్ సభ ఎన్నికలతోనేనేమో.

Show comments