సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో హిట్ కొట్టిన కల్యాణ్ కృష్ణ, తన రెండో ప్రయత్నంగా నాగచైతన్య హీరోగా సినిమా చేశాడు. అదే రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా ప్రెస్ మీట్ నిన్న జరిగింది. నిర్మాత నాగార్జున సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అసలు ఈ కథ ఎలా పుట్టిందనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.
నాగార్జునకు తను నటించిన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాలు మన్మధుడు, నిన్నే పెళ్లాడతా అట. ఈ రెండు సినిమాలకు దగ్గరగా నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధంచేయమని కల్యాణ్ కృష్ణను కోరాడట. అలా తయారైన సినిమానే రారండోయ్ వేడుక చూద్దాం. నిన్నే పెళ్లాడతా సినిమాలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్, మన్మధుడిలో లవ్ యాంగిల్ రెండూ ఇందులో కనిపిస్తాయని అంటున్నాడు నాగ్.
నాగ్ ఏ ఉద్దేశంతో ఈ విషయం చెప్పాడో కానీ, రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మాత్రం కచ్చితంగా ఈ రెండు సినిమాల్ని కలిపి రీమేక్ చేసినట్టే ఉంటుందట. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిన్నే పెళ్లాడతా సినిమాన్ని తలపిస్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే అంశంతో పాటు, క్లైమాక్స్ ఏంటనే విషయాన్ని కూడా ఇట్టే ఊహించుకోవచ్చు.
మరి ఇలాంటి ప్రిడెక్టబుల్ స్టోరీని కల్యాణ్ కృష్ణ తెరపై ఎలా ప్రజెంట్ చేశాడనేదే కీలకం. ఆ ప్రజెంటేషన్ పైనే సినిమా విజయం ఆధారపడి ఉంది. ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది, 2 సినిమాల్ని మిక్స్ చేసి కల్యాణ్ కృష్ణ తెలివిగా రీమేక్ సినిమా తీశాడంటూ పంచ్ లు వేస్తున్నారు.