రెడ్డి గార్లిద్దరిలో దోచుకునే హక్కు ఎవరిది?

అప్పట్లో పనికి ఆహార పథకం.. ఇప్పట్లో నీరు చెట్టు.. అనేమాట వినిపిస్తోంది రాయలసీమలో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తమ్ముళ్లకు దోచి పెట్టడానికి కల్పించిన పనులివి. బాబు అధికారంలో ఉండిన ఇంతకు ముందు పర్యాయాల్లో పనికి ఆహార పథకం మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దోపిడీనే జరిగింది.

దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు అసెంబ్లీలోనే ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశాయి. నాటికి మంత్రిగా ఉండిన నాగం జనార్ధన్ రెడ్డిని ‘బియ్యం రెడ్డి’ అంటూ ఎద్దేవా చేసే వాళ్లు కాంగ్రెస్ వాళ్లు. పనికి ఆహార పథకం కింద వచ్చిన బియ్యాన్ని తమ్ముళ్లు దోచుకున్న వైనం అది. అలా పనికి ఆహార పథకంలో ఏ స్థాయి దోపిడీ జరిగిందో ఇప్పుడు ఈ చెట్లు నాటే పనుల విషయంలో కూడా అదే స్థాయి దోపిడీ కొనసాగుతోంది.

ఇప్పటికే పచ్చని చెట్ల పేరిట జరుగుతున్న పచ్చ దోపిడీ వైనం వెలుగులోకి వచ్చింది. అనంతపురం వంటి జిల్లాలకు వెనుకబడిన  జిల్లాల అభివద్ధికి అంటూ కేంద్రం నుంచి వచ్చిన నిధులను మొక్కలు నాటడానికి అంటూ వాడేశారు. కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు ఒక్కో దానికి రూ.50 కోట్ల వరకూ వచ్చినా.. ఆ నిధులన్నీ బాబు పర్యటనల ఏర్పాట్లకు, నీరు చెట్లు కార్యక్రమానికే సరిపోయినట్టుగా తెలుస్తోంది.  ఈ మొక్కల నాటడానికి సంబంధించిన లెక్కల్లో శాస్త్రీయత లేదు. పది మొక్కలు నాటితే వంద మొక్కలు నాటినట్టుగా చూపించినా అడిగే నాథుడు లేడు. 

ఆఖరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రతి ఇంటి ముందూ ఒక్కటీ రెండు చెట్లు పడేసి వెళ్తున్నారు. వాటిని నాటుకొమ్మని ఆయా ఇళ్ల వారికి సూచిస్తున్నారు!ప్రతి టౌన్‌లోనూ.. ప్రతి పల్లెలోనూ ఇదే పని చేస్తున్నారు. నర్సరీల నుంచి ట్రాక్టర్లలో మొక్కలు తీసుకురావడం.. ఇళ్లలో మనుషులు ఉన్నా లేకపోయినా.. ఒకటీ లేదా రెండు మొక్కలను అక్కడ పెట్టి వెళ్లిపోవడం. అయితే వాటిని ఆ ఇంట్లో వాళ్లు నాటుతున్నారా? లేదా? వాటి సంరక్షణ ఎలా? అసలు నాటుకోవడానికి ఆ ఇంట్లో వాళ్లకు అవకాశం ఉందా లేదా? అనే విషయాల గురించి ఆలోచించే వాళ్లు కూడా ఎవరూ లేరు! 

ఇలా పడేసి వెళ్లిపోతున్న మొక్కలన్నింటినీ ఓవరాల్ నంబర్‌లో క్లైమ్ చేసుకోవచ్చు.  ఈ పనులను కాంట్రాక్టులుగా దక్కించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీలో ఉన్నందుకు ఈ విధంగా జేబులు నింపుతున్నారు. గరిష్టంగా ఒక్కో మొక్క విషయంలో  ప్రభుత్వ ఖాతా నుంచి డ్రా చేస్తున్న సొమ్ము రూ.50 వరకూ ఉంది. కొన్ని రకాల మొక్కలకు అంత కన్నా తక్కువ, మరికొన్ని మొక్కలకు ఎక్కువ రేటును కడుతున్నారు. అంతిమంగా ఆ మొక్కలను నాటకుండానే తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి డబ్బు వచ్చి పడుతోంది. 

మరి అయాచితంగా డబ్బులు వచ్చినప్పుడు... అంతా తమేక కావాలనే వాళ్లూ ఉంటారు కదా! ఈ అత్యాశే ఇప్పుడు ఈ పచ్చని చెట్ల పచ్చ దోపిడీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తోంది. కడప జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గంలో వైరి వర్గాలు ఆదినారాయణ రెడ్డి- రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఇందుకు సంబంధించి జరిగిన రచ్చ ఈ దోపిడినీ బట్టబయలు చేసింది. ఈ మొక్కలు నాటే పనులు మాకు దక్కాలంటే మాకు దక్కాలన్నట్టుగా పోటీలు పడ్డారు ఈ ఇద్దరు నేతల అనుచరులు. 

అయాచితంగా వచ్చే డబ్బు అంటే అందరికీ ఆశే కదా.. ఇద్దరూ తెలుగుదేశంలో ఉన్నారు.  దీంతో వలసవచ్చిన నేతల మనుషులకు, తెలుగుదేశంలో చాలాకాలం నుంచి ఉన్న నేత మనుషులకు మధ్య తన్నులాటే జరిగింది. మరి ఇప్పుడు నీరుచెట్టు పథకం ద్వారా దోచుకునే హక్కులు ఎవరికి ఉన్నట్టు? తెలుగుదేశం పాతకాపుకా లేక వైసీపీ నుంచి తరలివచ్చిన ఎమ్మెల్యేకా? చినబాబో, పెదబాబో విజయవాడలో పంచాయతీ చేసి చెప్పాలేమో ఈ విషయాన్ని!

Show comments