ఫన్నీ ఫన్నీ దెయ్యం..!

తెలుగు తెరపై దెయ్యాలు సరదా సరదాగా ఆడియన్స్‌ని మెప్పించడం చూస్తూనే వున్నాం. ఒక్కోసారి బాగానే భయపెడుతున్నాయ్ కూడా. దెయ్యాల సినిమాలకి ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న గిరాకీ అంతా ఇంతా కాదు. కామెడీ దెయ్యాల్నీ, భయపెట్టే దెయ్యాల్నీ.. ఇలా ఈ మధ్యకాలంలో చాలానే చూసేశాం. బాలీవుడ్‌లోనూ ఓ కామెడీ దెయ్యం త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 

అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఫిల్లౌరీ' ట్రెయిలర్‌ తాజాగా విడుదలయ్యింది. అన్షయ్‌ లాల్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణంలోనూ అనుష్క భాగం పంచుకుంటుండడం గమనార్హం. అన్నట్టు, ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్‌ కౌర్‌. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా వున్న మెహరీన్‌, బాలీవుడ్‌ సినిమా 'ఫిల్లౌరీ' పైనా చాలా ఆశలే పెట్టుకుంది. 

ఇక, ట్రైలర్‌ విషయానికొస్తే, సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసేలానే వుంది. కాస్సేపు దెయ్యంలా అనుష్కని చూపిస్తూనే, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ని కూడా ట్రైలర్‌లో పొందు పర్చడం గమనార్హం. ఈ ఫన్నీ దెయ్యం గురించి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ తెరపై 'ఫిల్లౌరీ' ఘనవిజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.

Show comments