89 కాదు.. ఓన్లీ 1 కట్‌.!

ఉడతా పంజాబ్‌.. బహుశా దేశంలో ఏ సినిమా గురించీ ఇంత చర్చ జరిగి వుండదు.. ఈ సినిమా గురించే, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సినిమాలో ఏముంది.? సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందా.? అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందా.? అన్న అంశాల సంగతి తర్వాత. టైటిల్‌ దగ్గర్నుంచే వివాదం మొదలైంది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్‌ బోర్డ్‌ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 89 'కట్స్‌' సూచించింది. 

ఇక, చిత్ర యూనిట్‌ సెన్సార్‌ బోర్డ్‌ 'కటింగ్స్‌'ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు 'ఉడతా పంజాబ్‌'కి బాసటగా నిలిచారు. ఎలాగైతేనేం, చిత్ర యూనిట్‌ విజయం సాధించింది. సెన్సార్‌ బోర్డ్‌కి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. 89 కాదు.. కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదల చెయ్యాల్సిందిగా, బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. దేశ చరిత్రలోనే ఇదో సంచలనాత్మక చిత్రమయ్యింది.. విడుదలకు ముందు. 

అందరికీ తెల్సిన విషయమే పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా చాలా ఎక్కువని. అక్కడినుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతుంటాయి. మాదక ద్రవ్యాల మత్తులో యువత కొట్టుమిట్టాడుతున్న వైనాన్ని 'ఉడతా పంజాబ్‌'లో ప్రస్తావించారు. ఈ చిత్ర కథాంశమదే. 'ఉడతా' అంటే గాల్లో తేలిపోవడం అని అర్థం. 'పంజాబ్‌ గాల్లో తేలిపోతోంది.. మత్తులో మునిగి తేలుతోంది..' అనే అర్థం వచ్చేలా 'ఉడతా పంజాబ్‌' టైటిల్‌ పెట్టడం వివాదాస్పదమయ్యింది. 

షాహిద్‌ కపూర్‌, కరీనాకపూర్‌, అలియాభట్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి అభిషేక్‌ చాబీ దర్శకుడు. ఏక్తా కపూర్‌, అనురాగ్‌ కాశ్యప్‌ తదితరులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా వివాదంలో సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పంకజ్‌ నిహ్లానీ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. రాజకీయ ఉద్దేశ్యాలతో ఆయన ఈ సినిమాకి 'కట్స్‌' విధించడం వివాదాస్పదమయ్యింది. 

Show comments