చంద్రబాబు, కేసీఆర్‌.. ఈ బంధం ధృడమైనది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కటయ్యారు. ఔనండీ, ఇది నిజం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేసీఆర్‌, చంద్రబాబు.. కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో ఒక్కటయ్యారు. అక్కడిదాకా ఎడమొహం పెడమొహం.. అన్నట్లుగానే వ్యవహరించినా, ఉమాభారతి చొరవ చూపించారు. పుష్పగుచ్చంలోని పువ్వుల్ని తీసి, కేసీఆర్‌కి ఒకటి.. చంద్రబాబుకి ఒకటి ఇచ్చారు. ఈ క్రమంలో తనతోపాటు ఆ ఇద్దరూ పుష్పగుచ్చం జట్టుకునేలా ఇద్దరి చేతులూ పట్టుకుని మరీ ఒప్పించారు ఉమాభారతి. 

చాలా చాలా చాలా చిత్రమైన సందర్భమిది. ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబుపైన కేసీఆర్‌, కేసీఆర్‌పైన చంద్రబాబు దుమ్మెత్తిపోసుకున్న విషయం విదితమే. 'నువ్వు నన్ను ఏమీ చేయలేవురా..' అని అదేదో సినిమాలో డైలాగ్‌ చెప్పినట్లు, ఇద్దరూ ఒకరికొకరు సవాల్‌ విసురుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ తెచ్చిన ఓటుకు నోటు కేసు అటకెక్కింది.. చంద్రబాబు తెచ్చిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కాలగర్భంలో కలిసిపోయింది. అఫ్‌కోర్స్‌.. అవి కోర్టుల్లో మగ్గుతున్నాయనుకోండి.. అది వేరే విషయం. 

ఎలాగైతేనేం, నీటి వివాదాలకు సంబంధించి చంద్రబాబు, కేసీఆర్‌.. ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలూ లేకుండా ఓ అభిప్రాయానికి వచ్చినట్లే కన్పిస్తోంది. అన్ని అంశాల్లోనూ కాకపోయినా, ఏదో ఒకటి రెండు విషయాల్లో అయినా ఏకాభిప్రాయానికంటూ వస్తే.. జనం ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. అంతే మరి, పాలకులు వివాదాల పేరుతో నాటకాలాడుతున్నా, జనం మాత్రం పాలకులు రెచ్చగొట్టే సెంటిమెంట్లతో ఒకరి మీద ఒకరు కొట్లాటకు దూకుతారు కదా.! 

పాలకులనండీ, రాజకీయ నాయకులనండీ.. అందరూ ఓ గూటి పక్షులే. ఆ గూడు పేరు రాజకీయం. మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలు. మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్ళాల్సిన పనిలేదు. హైద్రాబాద్‌లోనో, విజయవాడలోనూ కూర్చుంటే సరిపోయేది. ఇంకా నయ్యం.. అలా చేస్తే, తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌నీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు టీడీపీనీ ఆడి పోసుకోరా.? అన్నది ఆ రెండు పార్టీల ఉద్దేశ్యం కావొచ్చుగాక.!  Readmore!

ఎలాగైతేనేం, సుప్రీంకోర్టు వాతలెట్టాక.. కేంద్రం మెట్టు దిగి, కేంద్ర మంత్రి ఉమాభారతిని రంగంలోకి దించింది. అలా ఇద్దరు చంద్రులూ ఒక్కతాటిపైకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు సద్దుమణిగినట్లే. ఫిక్సయిపోదామా.? మళ్ళీ రాజకీయ వివాదాలు రాజేసి, రెండు రాష్ట్రాల్లోని ప్రజల్నీ రాజకీయ నాయకులు కొత్తగా రెచ్చగొడ్తారా.? ఏమో, రాజకీయం ఊరికే వుండదు కదా.!

Show comments