ముగ్గురు సీఎంల రాజీనామా అడుగుతున్న మోడీ?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కీలకమైన మార్పులు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అటు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల నియామకం, ఇటు కేంద్రమంత్రి వర్గంలో మార్పులు ఒకదానిపై మరోటి ప్రభావం చూపుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే గోవాలో ముఖ్యమంత్రి పదవి కోసం రక్షణశాఖ మంత్రి పారికర్ తో రాజీనామా చేయించారు.. అటు పంపేశారు. ఇదే సమయంలో మరికొన్ని మార్పులు కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది.

ప్రత్యేకించి ముఖ్యమంత్రుల హోదాలో ఉన్న వ్యక్తులను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడం పట్ల మోడీజీ ఆసక్తితో ఉన్నారట. ఒకరుకాదు, ఇద్దరుకాదు.. ఏకంగా మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేత రాజీనామా చేయించి, వారిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోనున్నారట. ఈ జాబితాలో ఉన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

వీరిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయించి.. కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. అదేమంటే.. వీరి పనితీరు మోడీకి బాగా నచ్చిందని, వారి సేవలు రాష్ట్రాలకు పరిమితం అయితే చాలదు.. దేశానికి కావాలని అనుకుంటున్నారట. అచ్చం పారికర్ కు గతంలో ఏ లాజిక్కులనైతే చెప్పారో.. ఇఫ్పుడు వీరి విషయంలోనూ అదే విషయాన్ని చెబుతున్నారు.

వీరి స్థానాల్లో ఆ మూడు రాష్ట్రాలకూ కొత్త వ్యక్తులను సీఎంలుగా నియమించడానికి కూడా కసరత్తు మొదలైందట. మరి గోవా ఒక బుల్లి రాష్ట్రం, అక్కడ ముఖ్యమంత్రిని మార్చే గేమ్ లోనే బీజేపీ అట్లర్ ప్లాఫ్ అయ్యింది. ఎవరో చప్రాసీలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కూర్చోబెట్టి ఎదురుదెబ్బ తిన్నారు. చివరకు చేసేది లేక.. పారికర్ ను తిరిగి పంపారు. బుల్లి రాష్ట్రం విషయంలోనే అలాంటి పరిస్థితి ఎదురైంది.

Show comments