ఈ ఖర్మ.. ఏ రాష్ట్రానికీ పట్టొద్దు

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ, పార్లమెంటులోకి ప్రవేశిస్తూ పార్లమెంటు లోపలి దృశ్యాల్ని తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని విడుదల చేశారు. ఇదీ వివాదం. ఆయనపై చర్యల కోసం ఆందోళన జరుగుతోంది. కేంద్రం, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే, అది పార్లమెంటు భద్రతకు సంబందించిన అంశం. లోక్‌సభ స్పీకర్‌ ఈ విషయమై 'ఆప్‌' ఎంపీకి నోటీసులు పంపించారు.. ఆ ఎంపీ, స్పీకర్‌కి వివరణ ఇచ్చారు. 

ఇంకోపక్క, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఓటింగ్‌కి వచ్చింది. దానికి, బీజేపీ ఎంపీలు అడ్డు తగిలారు. ఆప్‌ ఎంపీపై చర్యలు తీసుకోవాలని నినదించారు. సిగ్గు సిగ్గు.. ఇక్కడ అధికారంలో వున్నది తాము కాదు, కాంగ్రెస్‌ పార్టీ అని బీజేపీ ఎంపీలు భావించారనుకోవాలా.? చర్యలు తీసుకోవాల్సింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌. కానీ, అదే ఎన్డీయేకి చెందిన ఎంపీలు రాజ్యసభను స్తంభింపజేశారు. 

బహుశా దేశ రాజకీయాల్లో ఇంతకన్నా దిక్కుమాలిన వ్యూహం ఇంకొకటుండదు. సభలో తీవ్ర గందరగోళం చెలరేగిందట, సభ వాయిదా పడిందట. పార్లమెంటులో ప్రతి సెషన్‌లోనూ బోల్డన్ని బిల్లులు పాస్‌ అవుతుంటాయి. అవి పాస్‌ అయ్యే సమయంలో గందరగోళమేమీ వుండదా.? ఛాన్సే లేదు. అధికారంలో వున్న పార్టీ ఆయా బిల్లుల్ని పాస్‌ చేయించుకోవాలంటే చాలా సింపుల్‌గా విపక్షాల్ని 'ఔట్‌' చేసేస్తుంటుంది. అలాంటి సందర్భాలు కోకొల్లలు. 

ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదు.. అంతే కాదు, అసలు ఆ అంశం చర్చకు రావడమే బీజేపీకి ఇష్టం లేదు. అందుకే, సిల్లీగా ఆప్‌ ఎంపీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అంతే, ప్రత్యేక హోదా బిల్లు మళ్ళీ అటకెక్కింది. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, విభజన చట్టాన్ని అమలు చేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ద్వారా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రస్తావించారు.  Readmore!

పార్లమెంటు చేసిన చట్టం అమలవ్వాలని అదే పార్లమెంటులో మరో బిల్లు ప్రవేశపెట్టడమంటే, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఖర్మ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి పట్టిన ఖర్మ. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌ చేసిన ప్రకటనకి విలువ లేదు. పార్లమెంటులో జరిగిన చట్టానికి విలువ లేదు. మోడీ సర్కార్‌, ప్రజాస్వామ్యానికి ఏం గౌరవమిస్తున్నట్లు.?

Show comments