బాబు కనిపెట్టిన కొత్త ఫార్ములా

వెనకటికి చంద్రబాబు మాదిరిగానే ఓ గొప్పోడు వుండేవాడట. వాడు పక్కవాడిని పిలిచి...'వురే బాబూ..నువ్వు అటుకులు పట్రా..నేను ఊక పట్టుకొస్తాను..రెండూ కలిపేసి, ఆపై ఊదుకుని తినేద్దాం..' అన్నాడట. ఊక కలపడం ఎందుకు? ఊదడం ఎందుకు? అంటే తన వాటా అంటూ ఏదో  ఒకటి వుండాలి కదా? అందుకు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న సూక్తి ముక్తావళి కూడా అలాగే వుంది. బాబు చెబుతున్న దాని వెనుక వున్న సూక్ష్మం అర్థమైనా కూడా, ఆయన అను'కుల' పత్రికలు మాత్రం..అబ్బో...బాబుగారు ఏదో అధ్భుత ధర్మసూక్ష్మం కనిపెట్టారు అనే రేంజ్ లో ఇవ్వాళ వార్తలు ప్రచురించేసాయి. ఇంతకీ బాబుగారు చెప్పినదేమిటంటే..

వివిధ శాఖలకు బడ్జెట్ లో నిధులు వస్తాయి. అలాగే కేంద్రం వివిధ పథకాల కింద నేరుగా నిధులు ఇస్తుంది. కేంద్రం నిధులు అది చెప్పిన నార్మ్స్ ప్రకారం ఖర్చుచేసి, కేంద్రానికి లెక్కలు ఇవ్వాలి. సాధారణంగా ఇన్నాళ్లు రాష్ట్రప్రభుత్వాలు రెండు పనులు చేసేవి. ఒకటి కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించేసి, తమ తమ అవసరాలకు వాడేసుకోవడం. రెండవది కేంద్రం రోడ్లు వేసినా, ఇళ్లు ఇచ్చినా తామే ఇచ్చామనే కలరింగ్ ఇవ్వడం. 

అయితే ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రే కదా? ఇక్కడ ఏం కన్నాలున్నాయో తెలుసు కదా? అవన్నీ పూడ్చేస్తున్నారు. కేంద్రం నిధులు తూ.చ తప్పకుండా నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలి. వాటికి లెక్కలు పక్కాగా సమర్పించాలి. అప్పుడే మళ్లీ ఫండ్స్ ఇస్తారు. పైగా కేంద్రం పథకం అని స్పష్టంగా తెలిసేలా బోర్డులు కూడా వుండాలంటున్నారు. రాజధానికి ఇచ్చిన నిధులపై కూడా ముఫై మూడు ఆరాలు తీస్తోంది కేంద్రం. నిర్మాణానికి ఇచ్చిన నిధులు భూ సమీకరణ కౌలు చెల్లింపులకు వాడితేనే ఒప్పుకోవడం లేదు. అంత నిర్దిష్టంగా వుంది కేంద్రం. 
ఇక్కడ రాష్ట్రం పరిస్థితి చూస్తే ఆర్థికంగా అంత సీన్ లేదు. మనకు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీలు ఎక్కువ. జనాలు ఓటేయడానికి పార్టీ తరపున కాకుండా ప్రభుత్వం డబ్బులతోనే ఫ్రీలు ఇచ్చేయడం అనే సూత్రం కనిపెట్టింది బాబుగారే. మరి అలాంటపుడు ఎన్ని డబ్బులు వస్తే సరిపోతాయి? అందుకే బాబుగారు ఇప్పుడు ఓ కొత్త ధర్మసూక్ష్మం కనిపెట్టారు. ఏశాఖ అయినా తమకు వచ్చిన కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కలిపేయాలట. అలా కలిపేసి ఆయా శాఖల ఖర్చులకు, పనులకు వాడాలట. ఇలా అయితేనే ప్రగతి సాధ్యమట. 

వారెవ్వా..ఏం చెప్పారు. రాష్ట్రం రూపాయి ఇస్తుంది..కేంద్రం 99 ఇస్తుంది..అప్పుడు ఆ శాఖ వంద రూపాయిలు ఖర్చు చేస్తుంది అనే టైపు అనుకోవాలి. ఈ ఏడాది మొత్తం మీద వివిధ శాఖలకు నిధులు అరకొరగా ఇస్తూనే రోజులు దొర్లించేసారు. ఇప్పుడు మళ్లీ బడ్జెట్ టైమ్ వచ్చింది. లక్షా యాభై కోట్ల భారీ బడ్జెట్ కు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో రెవెన్యూ లోకే యాభై వేల కోట్ల మేరకు వుండేలా వుంది. కానీ అంతా సూపర్ గానే వుందని, డబ్బుల లోటు లేదని చూపేందుకు ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Readmore!

నిజంగా డబ్బులు లోటే లేకుంటే, గత ఏడాది జనవరి నుంచి ఉద్యోగులకు రెండు డిఎ లు ఎందుకు బకాయి పడతారు. అంగన్ వాడీలకు ఆర్నెల్లుగా జీతాలెందుకు లేవు. ట్రెజరీల్లో అన్ని రకాల చెల్లింపులు ఎందుకు నిలిపేస్తారు? ఇవ్వాల్టి ఈనాడులోనే వచ్చింది..విశాఖ ప్రభుత్వ మెడికల్ కాలేజీ జనాలకు జనవరి జీతాలు ఇంతవరకు అందలేదట. అంతే కాదు..ముఫై లక్షల మేరకు జీతాల చెల్లింపు నిలిచిపోయిందట. మరి పరిస్థితి ఇలా వుందని లోకల్ ఎడిషన్లు ఘోషిస్తుంటే, మెయిన్ ఎడిషన్లేమిటి లక్షన్నర కోట్ల బడ్జెట్ అంటూ డప్పేస్తాయి? 

Show comments