లేని శతృవుతో 'చంద్రబలి' పోరాటం.!

ప్రతి ఒక్కరూ 'బాహుబలి'లా అభివృద్ధిలో ముందడుగు వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అమెరికా పర్యటనలో అక్కడి తెలుగు ఎన్నారైలకు క్లాసులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధిలో తమతో కలిసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనీ ఈ సందర్బంగా చంద్రబాబు, వారికి విజ్ఞప్తి చేశారు. 

మామూలుగా అయితే, చంద్రబాబు అమెరికా యాత్రని అభినందించి తీరాల్సిందే.. ఆహ్వానించి తీరాల్సిందే. ఏ ముఖ్యమంత్రి అయినా, విదేశీ పర్యటనలు చేసేదెందుకోసం.? అభివృద్ధి కోసమే కదా.! అధికార పర్యటనలు ఎవరు చేసినాసరే, వాటిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, ఆయా పర్యటనల వల్ల జనానికి ఒరిగేదేంటి.? అన్నదే కీలకమిక్కడ. చంద్రబాబుకి విదేశీ పర్యటనలు కొత్త కాదు. ఇప్పటికే పలు దేశాలు చుట్టి వచ్చేశారు. ఆయా పర్యటనలతో, ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ఏం ఒరగబెట్టారట.? ఇదే ఇప్పుడు అందరినుంచీ దూసుకొస్తున్న ప్రశ్న. 

సరే, వెళ్ళిన పర్యటనలన్నీ విజయవంతం కావాలని రూలేమీ లేదు. ఒక్కోసారి పర్యటనలు వృధాగా మిగిలిపోతుంటాయి. ప్రయత్నమైతే జరిగింది కదా.. అని సరిపెట్టుకోవాల్సిందే. కానీ, చంద్రబాబు సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన ఆలోచనలు భిన్నంగా వుంటాయి. అందుకే, అమెరికా పర్యటనలో ఆశించిన స్పందన రాకపోవడంతో, వింత నాటకానికి తెరలేపారు. అమెరికా నుంచి చంద్రబాబు ఆదేశాలతో, అధికార పార్టీ నేతలు ప్రతిపక్షంపై చెలరేగిపోతున్నారు. 

వైఎస్సార్సీపీ సానుభూతిపరులో మద్దతుదారులో, చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా కుట్రపన్నారట. ఇది టీడీపీ ఆరోపణ. పోనీ, అది నిజమే అనుకుందాం. ఆ మాత్రందానికే, చంద్రబాబు టూర్‌కి కష్టకాలమొచ్చిపడ్తుందా.? ఛాన్సే లేదు. కేంద్రంలో వున్నది ఎన్డీయే ప్రభుత్వం. అందులో చంద్రబాబు పార్టీ కూడా భాగస్వామి. అలాంటప్పుడు, వైఎస్సార్సీపీ కుట్రలు పన్నితే, అవి రివర్సయి.. వైఎస్సార్సీపీనే ముంచేస్తాయి. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అభివృద్ధికి అడ్డంపడుతున్నారన్నది పాత విమర్శే. అభివృద్ధికి అడ్డంపడేంత 'బలం' వైఎస్సార్సీపీకి వుంటే, చంద్రబాబు ఎలా రాజధాని అమరావతిని డిక్లేర్‌ చేశారు.? అక్కడెలా, తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు.? అన్నిటికీ మించి, చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఎలా మంత్రి అయ్యారు.? వీటన్నిటినీ వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అయినా, అవన్నీ జరిగాయి కదా.! 

జరిగినవాటికేమో, చంద్రబాబు ఘనత. జరగనివాటికేమో వైఎస్‌ జగన్‌ కుట్ర.. ఇలా చంద్రబాబు వింత రాజకీయాల్ని నడుపుతున్నారిక్కడ. 'బాహుబలి' సినిమా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న చంద్రబాబుకి ఓ విషయం అర్థం కావడంలేదు. లేని శతృవుని వున్నాడనీ, అతనే జగన్‌ అనీ నిరూపించేందుకు 'చంద్రబలి' నానా పాట్లూ పడుతున్నారని జనానికి మాత్రం అర్థమయిపోరతోంది. 

ప్రత్యేక హోదాకి అడ్డంపడిందెవరు.? ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నా సర్దుకుపోతున్నదెవరు.? పోలవరం ప్రాజెక్టుని గందరగోళంలో పడేసిందెవరు.? మూడేళ్ళయినా అమరావతిలో అధికారిక నిర్మాణాలు (తాత్కాలిక సచివాలయం మినహా) ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు.? దీన్ని అడ్డుకున్నదెవరు.? ఈ ప్రశ్నలకు చంద్రబాబు అండ్‌ కోస సమాధానమివ్వగలిగితే, టీడీపీ చెబుతున్నట్లు.. శతృవు వున్నాడనే అనుకోవాలి.

Show comments