తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ గుసగుస ఇదే. ఇక త్వరలో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ చేపట్టే అవకాశాలున్నాయన్నదే. దీనికి కారణం కేసిఆర్ తన అధికారం కొడుక్కు అందించాలన్న కోరిక కాదట. కేసిఆర్ వీలయినంత ఎక్కువగా అధికార కార్యక్రమాల్లో పాల్గోనడం తగ్గించాలన్నదేనని, ఆ విధంగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
నిజానికి కేటిఆర్ ఇప్పుడు దాదాపు డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగానే వున్నారు. తెల్లవారి మీడియాలో కేసిఆర్ పేరుకన్నా కేటీఆర్ పేరే ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎక్కవగా కేటిఆర్ ప్రమేయంతోనే రూపు దిద్దుకుంటున్నాయి. దాదాపు అన్ని వ్యవహారాలు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.
అయితే కేసిఆర్ ఆరోగ్యానికి వచ్చిన సమస్యేమీ లేదు కానీ, ఆయనకు మరింత విశ్రాంతి ఇవ్వాలని, పని వత్తిడి పెంచకూడదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. కేసిఆర్ కూడా స్వయంగా తన పదవిని కెటీఆర్ కు అప్పగించి తాను పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని నిర్ణయించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకుని చాలా కాలమే అవుతోందని, అయితే ఇప్పుడు త్వరలో అమలు చేయాలని అనుకుంటున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్న తరువాతే కేటీఆర్ కు దశల వారీగా ప్రాధాన్యత పెంచుతూ వచ్చారని, తన పని తీరుతో కేటిఆర్ అందరినీ ఆకట్టుకుని, మంచి నేతగా ఎదిగారని, అందుకే ఇక ఆలస్యం చేయకుండా పగ్గాలు అప్పగిస్తే ఎలా వుంటుందని కేసిఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వన్ ఫైన్ మార్నింగ్ కేటిఆర్ కు పగ్గాలు అప్పగించడం ఖాయమని, 2019 ఎన్నికలు కేటీఆర్ ముఖ్యమంత్రిగానే జరుగుతాయని తెరాస కేడర్ లో వినిపిస్తోంది.