అనంతలో భారీ ల్యాండ్ డీల్.. అధికార పార్టీకి వాటాలు!

అనంతపురం చరిత్రలో ఆ ల్యాండ్‌కు సంబంధించిన వివాదం మరోటి లేదు. టౌన్‌కు సెంటర్ అనదగ్గ ఏరియాలోని ఆ భూమి వ్యవహారంపై గత పదేళ్లుగా రచ్చ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి అదంతా ఒక ట్రస్టుకు చెందిన భూమి. అలాగని అదేమీ వారు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందినది కాదు. ఆ ట్రస్టువారు చాలా సంవత్సరాల కిందటే తమ కార్యకలాపాలను దాదాపుగా నిలిపేశారు. ఆ అదునులో ఆ ల్యాండ్ పై ఆక్రమణదారులు చేరిపోయారు. పెద్దల కన్ను పడక ముందే సామాన్యులు చాలామంది అక్కడ షెడ్లు వేసుకున్నారు. వారికి కమ్యూనిస్టు పార్టీ అండ. ఇంతలోనే ఆ ఆక్రమణదారులను ఖాళీ చేయించలేక సదరు ట్రస్టు ఆ భూమిని అమ్మకానికి పెట్టింది. దాన్నొక రాజకీయ పార్టీ నేత కొన్నాడు. ఆక్రమించిన వారందరినీ అక్కడ నుంచి పంపించాలంటే అది పొలిటికల్ లీడర్లేక సాధ్యం కదా!

మార్కెట్ ధరతో పోలిస్తే కొంచెం చవకేక అమ్మేసుకుని ట్రస్టు వాళ్లు దాన్ని వదిలించుకున్నారు. అక్కడ నుంచే కొత్త గొడవ మొదలైంది. ఆక్రమణదారులంతా కలిసి కోర్టుకు ఎక్కారు. తాము దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నామని.. ఆ భూమి తమకు చెందుతుందని వాళ్లు కోర్టుకు ఎక్కారు. అందులోనూ ఆ భూమి కొన్న రాజకీయ నేత అప్పటికి అధికార పార్టీలో ఉండే సరికి.. తెలుగుదేశం అనుకూల పత్రికలు ఆక్రమణదారుల పక్షాన నిలిచాయి. తను ఆ భూమిని చట్టబద్ధంగా కొన్నాను అని.. ఆక్రమించిన వాళ్లు ఎలా భూమిని తమదని అంటారని.. సదరు రాజకీయ నేత కోర్టులో తన వాదన వినిపించాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ వివాదం కోర్టులో కొనసాగింది. చివరకు రాజకీయ నేతకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది!

అయినప్పటికీ కమ్యూనిస్టు నేతలు, పచ్చ పేపర్లూ ఊరికే ఉండలేదు. చట్టపరంగా కొన్న వ్యక్తి కుటుంబంపై అనుదినం వార్తలే. కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా కమ్యూనిస్టు పార్టీ వాళ్లు లొల్లి కొనసాగించారు. ఆ భూమి ఆక్రమణదారులేక చెందాలనేది వీరి వాదన. ఇలా కొనసాగుతున్న తతంగానికి ఇటీవలే పుల్‌స్టాప్ పెట్టాడు ఆ రాజకీయనేత. ఈ సెటిల్ మెంట్‌లో తెలుగుదేశం నేతలు, జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా భాగస్వామి కావడం విశేషం.

తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరితే ఆ భూమి విషయంలో ఎలాంటి ఇష్యూ లేకుండా చూస్తామని అధికార పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినా.. సదరు నేత దానికి అంగీకరించలేదు. అదిగాక మరేమైనా అడగాలన్న అతడి ప్రతిపాదన మేరకు కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు మంత్రిగారు. ఫ్యాక్షన్ నేఫథ్యం నుంచి వచ్చిన ఆ మంత్రిగారితో పాటు.. జిల్లాకు చెందిన తెలుగుదేశం లీడర్లంతా వాటాలకు వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన ఒక సీనియర్ లీడర్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. వీళ్లందరికీ కలిసి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించుకుని.. ఆ స్థలానికి సంబంధించి వివాదాన్ని పరిష్కరించుకున్నారు. వీళ్లందరికీ డబ్బులు ముట్టడంతో ఇక తెలుగుదేశం పార్టీ ఆ వివాదం గురించి మాట్లాడదు!  Readmore!

ఆ భూమి ముట్టడికి తెలుగుదేశం నేతలు వెళ్లరు. అంతేకాదు.. ఈ భూ వివాదం గురించి పుంఖాను పుంఖాలుగా రాసిన తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా ఇప్పుడు దాని గురించి రాయడం ఆగిపోయింది. తెలుగుదేశం నేతలు రాజీ పడటంతో ఆ పత్రికలు కూడా రాజీ పడ్డాయి. ఇక జిల్లాకే  చెందిన ఒక కమ్యూనిస్టు పార్టీ ముఖ్యనేతకు కూడా కొంత పైకం చెల్లించబడినది అని సమాచారం. చట్టపరంగా భూములు కొంటే చాలదు.. అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచినప్పుడే ఆ భూమిపై సర్వహక్కులూ సమకూరుతాయని సందేశం ఇస్తోంది ఈ భూ వ్యవహారం.

Show comments