అధ్యక్షుడు అవుతాడా? కాడా?

శవంలోని భేతాళుడు ఎప్పటిమాదిరిగానే తిరిగి చెట్టెక్కినట్లుగా రాహుల్‌ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడు అవుతాడా? కాడా? అనే చర్చ మళ్లీ దేశంలో మొదలైంది. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ చర్చ ఈ ఏడాదైనా ముగుస్తుందా? ఆయన పగ్గాలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెసు నాయకులు 'అవును' అని కచ్చితంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కాని ఆయన అధ్యక్షుడు అవుతాడని ఎక్కువమంది అనుకుంటున్నారు.

ఇందుకు ప్రధాన కారణం ఈ ఏడాదితో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవీ కాలం ముగుస్తుంది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని (రాహుల్‌ తప్ప మరొకరు కాదు కదా) ఎన్నుకోవల్సి ఉంది. కాంగ్రెసు సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరునాటికి ముగిసిపోవాలని డెడ్‌లైన్‌ విధించారు. గత ఏడాదే సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకొని ఏడాది పొడిగించారు. దాంతో సోనియా గాంధీ పదవీ కాలం ఏడాది పెరిగింది. అనారోగ్యం కారణంగా ఆమె ఇక అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు సుముఖంగా లేరు.

ఇప్పటికే ఆమె సుదీర్ఘకాలంగా (19 ఏళ్లు) పార్టీని నడిపిస్తున్నారు. కాంగ్రెసులో ఇదో రికార్డు. అందుకే కుమారుడికి పగ్గాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. కాని రాహుల్‌ ముందుకు రావడంలేదు. కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో నేతలంతా ముక్తకంఠంతో 'రాహుల్‌ మీరు అధ్యక్ష పదవి స్వీకరించండి' అని కోరినా యువరాజు ఇప్పుడే కాదని ఏడాదిపాటు వాయిదా వేశారు. పార్టీ సీనియర్‌ నాయకుల్లో కొందరు అధ్యక్షురాలిగా సోనియాయే ఉండాలని కోరుతుండగా, యువ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన, చేరుతున్నవారు రాహుల్‌ రావాలని కోరుతున్నారు.

పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగానే అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరుగుతుందా? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. సంస్థాగత ఎన్నికలకు, అధ్య్ష ఎన్నికలకు సంబంధం లేదని కేంద్ర మాజీ మంత్రి, సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏకే ఆంటోని చెప్పారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని ఎంపిక చేసేది కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యుసీ) కాబట్టి ఆ పని సంస్థాగత ఎన్నికల తరువాతైనా జరుగుతుందన్నారు.

రాహుల్‌ కాంగ్రెసు అధ్యక్షుడు అవుతాడని, ప్రధాని అవుతాడని 2011 నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రధాని అవుతాడా? కాడా? అనేది చెప్పలేంగాని అధ్యక్షుడు కావడం కష్టం కాదు. పార్టీలో కొందరు వ్యతిరేకించినా సోనియా గాంధీ మాటకు ఎదురుండదు కాబట్టి అధ్యక్షడై తీరుతాడు. ఆయన ఓకే అనడమే మిగిలింది. రాహుల్‌ని అధ్యక్షుడిని చేయాలనుకున్నప్పుడల్లా కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఆయన పార్టీని సమర్థంగా నడపలేరనే అనుమానం కలుగుతోంది. వచ్చే ఏడాది (2018) కాంగ్రెసుకు అత్యంత కీలకం.

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందో లేదో చెప్పలేం. దాని విషయం అలా పక్కనుంచితే షెడ్యూలు ప్రకారం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సివుంది. ఈ రాష్ట్రాల్లో గుజరాత్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమైనవి. అందులోనూ ప్రధాని స్వరాష్ట్రమైన  గుజరాత్‌ ఎన్నికలు  జనవరిలోనే జరుగుతాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్ష పదవి కీలకమైన అంశమని చెప్పొచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో అనారోగ్యం రీత్యా సోనియా గాంధీ జోక్యం చేసుకోలేదు. మొత్తం బాధ్యత రాహుల్‌ తీసుకున్నారు. అధ్యక్ష పదవి ఆయనకు అప్పగించాలనుకుంటున్న సోనియా కుమారుడి సామర్థ్యం పరీక్షించడం కోసం తాను దూరంగా ఉండిపోయారు.

కాని 'రాహుల్‌ విఫలమయ్యారు' అనే ముద్ర పడింది. ఒక్క పంజాబ్‌ ఇందుకు మినహాయింపు. అక్కడి విజయంలో క్రెడిట్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు పోయింది. గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో కాంగ్రెసుకు మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. 

ఇదంతా రాహుల్‌ గాంధీ వైఫల్యంగా నాయకులు భావిస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు, ప్రధాన ప్రచారకర్తగా పనిచేయనున్నట్లు జోరుగా ప్రచారం జరిగినా చివరకు ఆమె గమ్మున ఉండిపోయింది. దీంతో కాంగ్రెసు ఘోర పరాజయంలో ఆమెకు పాత్ర లేకుండాపోయింది. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెసుకు పొత్తు కుదరడం వెనక ప్రియాంక గాంధీ కృషి ఉందని నాయకులు ప్రశంసించారు.

అంతటితోనే ఆమె పాత్ర ముగిసింది. రాహుల్‌ విధేయులు  తల్లి అనారోగ్యం దృష్ట్యా రాహుల్‌ అధ్యక్షుడు అయ్యేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. కొందరు ఇంకో మార్గం చెబుతున్నారు. సోనియాను అధ్యక్షురాలిగా కొనసాగించి రాహుల్‌కు ఓ బలమైన బృందాన్ని (సలహాదారులు) ఏర్పాటు చేయాలంటున్నారు. రాహుల్‌ ఏం చేస్తారో....!

Show comments