ఏపీ పెద్దతలలు.. రూ.570 కోట్ల పై విచారణ..?!

ఆ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అంతే చప్పున చల్లారి పోయింది. తమిళనాడు నుంచి ఏపీ వైపు తరలి వచ్చిన రూ.570 కోట్ల రూపాయలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వస్తాయనంగా అంత డబ్బు అటువైపు నుంచి తరలి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ డబ్బు ఎవరిది? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొన్ని గంటల పాటు అదో మిస్టరీగా నిలిచింది. అయితే ఇది తమ డబ్బు అని ఏపీ లోని ఎస్ బీఐ బ్రాంచు ఒకటి ప్రకటించింది.

అయితే వారి ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చింది కూడా. ఆ డబ్బు వెంట సరైన సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం, పోలీసులు డబ్బుతో వెళుతున్న కంటైనర్లను ఆపగానే దానికి ఎస్కార్ట్ గా వచ్చిన వారు పారిపోవ ప్రయత్నించడం వంటి పరిణామాలు అది బ్యాంకు డబ్బు కాదనే అనుమానాలను ధ్రువపరిచాయి. ఇదే సమయంలో ఆ డబ్బుతమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నేతది అనే ఆరోపణ కూడా వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగనైస్టుగా ఉంటాయనే సర్వేలు వెల్లడికావడంతో ఆ డబ్బును సదరు నేత ఏపీకి తరలించే యత్నం లో భాగంగానే ఆ డబ్బు తరలి వచ్చిందని అనధికార సమాచారం వచ్చింది. అయితే సదరు నేతకు కేంద్రంలో ఇప్పుడు మంచి గ్రిప్ ఉంది. ఆ డబ్బు పట్టుబడగానే కొన్ని గంటల పాటు అల్లకల్లోలం అనంతరం అది బ్యాంకు డబ్బు అని ప్రకటన రావడం వెనుక కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుడి ప్రమేయం ఉందనే వార్తలూ వచ్చాయి.

ఆ నేతను రక్షించడానికి ఆ డబ్బులో కొంత వాటాను తీసుకుని కేంద్రం నుంచి ఆ ప్రకటన వచ్చిందంటారు. ఈ విషయంలో తమినాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఘాటుగా స్పందించాడు. ఆ డబ్బుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్ ను బట్టి ఆ డబ్బు ఎవరిదై ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం కాదు.

ఇక ఆ తమిళ నేత డబ్బు ఏపీ వైపే ఎందుకు వచ్చింది? అనేది కూడా పరిశీలించాల్సిన అంశమే! ఆ డబ్బు అక్రమం అయినచో.. తోడు దొంగలు అటు తమిళనాడులోనూ, ఇటు ఏపీలోనూ ఉన్నారని స్పష్టం అవుతుంది. అక్కడా ఇక్కడ అధికారంలో ఉన్న వారే ఆ తోడు దొంగలనేది గట్టిగా వినిపించే మాట. ఇప్పుడు అంశంపై విచారణకు ఆదేశించింది తమిళనాడు కోర్టు. మరి ఇప్పుడు అసలు దొంగలు బయటకు వస్తారా? అయినా.. అధికారం చేతిలో ఉంది కాబట్టి.. కొన్ని గంటల్లోనే 570 కోట్ల రూపాయలు బ్యాంకుది అని చాటిన వారికి, ఇప్పుడు విచారణల నుంచి బయటపడటం పెద్ధ కష్టమా?

Show comments