ప్రజలు అనగా పచ్చచొక్కాలు మాత్రమే!

ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అనేది పుస్తకాల్లో మనం చదువుకునే మాట! కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యవహారాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం అనేది పచ్చచొక్కాల కోసం మాత్రమే పనిచేస్తుందనే అభిప్రాయం కలుగుతుంది. పచ్చచొక్కాల వారికి అనగా.. తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎడా పెడా దోచిపెట్టడానికి, వారిని పార్టీలో అంటిపెట్టుకుని, పార్టీ పట్ల వారిలో విధేయతను పెంచుకుని.. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రకరకాల ఆధునిక స్కెచ్ లు వేయడంలో చంద్రబాబు కోటరీ ఆరితేరినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబునాయుడు నిర్వహించిన సెమినార్ లో ప్రభుత్వ పథకాల ద్వారా ఉద్దేశించిన సంక్షేమాన్ని కార్యకర్తలకు అడ్డగోలుగా దోచిపెట్టడంలో వైఫల్యాల్ని గురించి పలువురు ఏకంగా చంద్రబాబునాయుడునే నిలదీయడం విశేషం. దానికి ఆయన స్పందించిన తీరును కూడా గమనిస్తే.. రాబోయే రోజుల్లో పచ్చ చొక్కాలకు అడ్డగోలుగా దోచిపెట్టడం జరుగుతుందని అర్థమవుతుంది.

అమరావతిలో మంగళవారం నాడు చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో సెమినార్ నిర్వహించారు. తన సహజశైలిలో అద్భుతంగా పనిచేయకపోతే మీ అందరి అంతు చూస్తా.. పని చేయని వారికి టిక్కెట్లు ఇవ్వను... ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది.. అందరూ కష్టపడి పనిచేయాలి... లాంటి డైలాగులు అన్నీ యధావిధిగా వల్లించారు. అయితే నాయకులు కూడా నిజానికి ఎదురుదాడికి దిగారు.

తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. నియోజకవర్గాల్లో కార్యకర్తలను ఇళ్లు కట్టుకోమని చెప్పాం అని, ఆ తర్వాత గృహనిర్మాణ పథకం వర్తింపజేసి నిధులు ఇస్తాం అని హామీలిచ్చాం అని.. ఇవి కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఇళ్లు కట్టేసుకున్న తర్వాత.. వాటిని గృహనిర్మాణ పథకం కిందికి తేవడం అంటే.. అడ్డగోలుగా ఉన్న ఇళ్లకే ఆ స్కీము ద్వారా రాగల లబ్ధిని దోచిపెట్టడం అని స్పష్టంగానే అర్థమవుతోంది.

కార్యకర్తల ముసుగు కింద ఉన్న వారందరికీ ఇలా దోచిపెట్టేయాలని నాయకులు ఏకంగా చంద్రబాబునే... బహిరంగంగానే అడగడం వారి తెగింపునకు నిదర్శనం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2000 వరకు ఇలాంటివి అవసరం అని వారు చెబుతున్నారు. అంటే రాబోయే రెండేళ్లలో ఒక్కో నియోజకవర్గంలో 2000 మంది పచ్చచొక్కాలకు ఎడాపెడా హౌసింగ్ స్కీము లబ్ధి మొత్తాలను దోచిపెట్టేస్తారన్నమాట. వారు ఏదో ఒక ఇల్లు చూపిస్తే చాలు.. నిధులు వచ్చేస్తాయి.

సర్కారీ ఖజానా సొమ్మును ఇలా సంతర్పణ చేసేసి.. వారిని తమ పార్టీ విదేయులుగా మార్చుకుని వాడుకోడానికి తెలుగుదేశం పార్టీ పెద్ద స్కెచ్చే వేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అనేది ప్రజలకోసం, పేదల కోసం పనిచేసేదిగా ఉండాలిగానీ.. వారి సంక్షేమానికి పథకాలు రూపొందించాలి గానీ.. చంద్రబాబు సర్కారు.. కేవలం కార్యకర్తల కోసమే పథకాలను వక్రమార్గంలో వాడుకుంటున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments