తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌- పోలిక, తేడాలు

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు మార్చినెలలోనే ఆరంభం అవడం ఒక విశేషంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆనాటి ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు ఆరంభిస్తే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 2011 మార్చి 12న యువ సంచలనం, దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌ రెడ్డి  స్థాపించారు. ఎన్‌టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, పార్టీ అద్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అయ్యారు. ఇక జగన్‌ కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి, తన తండ్రి ఆశయాల కోసం పార్టీని స్థాపించారు. 

చంద్రబాబు తన మామ పట్ల ఏ మాత్రం కనికరం చూపని వ్యక్తిగా బావన ఉన్నా, ఎన్‌టీఆర్‌ స్వయంగా అల్లుడు చంద్రబాబును తీవ్ర పదజాలంతో విమర్శించినా, ఆయనకు తానే వారసుడనని చంద్రబాబు చెప్పుకోగలిగారు. పార్టీని నడపడం ఎన్‌టీఆర్‌ తర్వాత ఆయన కొడుకుల వల్లకాదని తేల్చి వారిని డమ్మీలుగా చేయడంలోను తాను ఇంతకాలం పార్టీని నిలబెట్టడంలోను సఫలం అయ్యారని ఒప్పుకోవాలి. ఎన్‌టీఆర్‌ మరణంతో టీడీపీ రాజకీయం అంతా చంద్రబాబు వశం అయిపోయింది. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సహకారంతో ఒకసారి, మోడీ నేతృత్వంలోని బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి రాగలగడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగారు. వరసగా పదేళ్లపాటు అధికారం లేకపోయినా, 2014లో ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌ చేపట్టగలగడం చంద్రబాబు విశిష్టతే. అయితే ఇందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, అనుసరించిన విదానాలు ఆ తర్వాత పాలన చేస్తున్న తీరు విలువలతో కూడిందిగా లేదు. 

ఎన్‌టీఆర్‌ పార్టీని స్థాపించినప్పుడు ఫిరాయింపులను ఒప్పుకునేవారుకారు. అలాగే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని భావించేవారు. కాని చంద్రబాబు అలాంటి విలువలు, నిజాయితీ వంటి అంశాలలో పెద్ద పట్టుదల ఉండదు. కాకపోతే నీతులు, సుద్దులు చెప్పగలరు. అందుకు విరుద్దంగా అనైతికంగా వ్యవహరించగల సమర్దత చంద్రబాబు సొంతం. తన కుమారుడిని తన వారసుడిగా రెడీ చేస్తున్నారు. ఒకప్పుడు పరస్పరం అభిమానాలతో ఉన్న పార్టీలో ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఎక్కువగా పరస్పర అవసరాల కోసం ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది.

ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలలో విలువలు ఉండాలని చెబుతూ అనైతిక ఫిరాయింపులకు ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడం మెచ్చుకోవాలి. చంద్రబాబు కన్నా చిన్నవాడైనా ఈ విషయంలో విలువలు పాటించినందుకు జగన్‌ను మెచ్యుకోవాలి. అలాగే రుణమాఫీ వంటి అంశాలలో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వెనుకాడకుండా, రాజకీయ లబ్దిపొందతే, జగన్‌ ప్రజలను మోసం చేయడానికి ఇష్టపడక నష్టపోయారు. తన పార్టీ నుంచి ఇరవైఒక్క మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, పట్టుసడలని ధీమాతో ప్రజల మధ్య తిరుగుతూ జగన్‌ పోరాటాలు చేస్తున్నారు. 

అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు రావడంవల్ల వచ్చినా, మరే కారణంతో అన్యాయంగా వచ్చినా జగన్‌పై ఉన్న కేసులు తేలేవరకు ఆయనకు కొంత చికాకే. ఆయన సంస్థలలో పెట్టుబడులు పెట్టడం నేరంగా చూపించడానికి సీబీఐ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఆయనకు పెద్ద మైనస్‌గా ఉంటుంది. దానిని కిందామీద పడి మేనేజ్‌ చేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన నైపుణ్యతను అందరూ ప్రస్తావిస్తుంటారు. స్థూలంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అబద్దాలపై నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తుంటే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాల ద్వారా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు 2019 ఎన్నికలే అసలైన పరీక్ష అవుతుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments