లగడపాటి కామెడీ మామూలుగా లేదు!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాకా గాయబ్ అయ్యాడు లగడపాటి రాజగోపాల్. ఎవరు గెలుస్తారనే అంశం గురించి పోలింగ్ కు ముందు నుంచినే రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టిన లగడపాటి ఇప్పుడు మీడియా ముందుకు రావాలి. తనుచెప్పిన జోస్యం ఎందుకంత కామెడీగా నిలిచిందో వివరించాలి.

ఫలితాలకు ముందు కేసీఆర్ ను ఓడించడానికి లగడపాటిని కూడా ఒక కార్డుగా ఉపయోగించుకున్న తెలుగుదేశం అనుకూల మీడియా అయినా ఇప్పుడు ఆయనను టీవీ తెరల మీదకు తీసుకురావాలి. అయితే ఈ గ్యాంగ్ లో ఎవరికీ విలువల్లేవు. అలాంటప్పుడు లగడపాటి మీడియా ముందుకు వచ్చి చెంపలేసుకుంటాడని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి అయిన తర్వాత, లగడపాటి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటే నవ్వురాక మానదు. వామ్మో ఎన్నికబుర్లు చెప్పాడు! జగ్గారెడ్డి అరెస్టు తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిపోయిందట, రేవంత్ రెడ్డి అరెస్టుతో తెలంగాణలో కేసీఆర్ మీద ప్రజా వ్యతిరేకత పతాకస్థాయికి వెళ్లిందట!

చివరికి ఏమయ్యింది? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నెగ్గలేకపోయాడు. రేవంత్ అరెస్టుతో కేసీఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిందని లగడపాటి చెబితే, సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి ఓడాడు. భారతీయ జనతా పార్టీ బలపడిందని కూడా లగడపాటి చెప్పుకొచ్చాడు.

లగడపాటి చెప్పిన ప్రతిమాట వెనుకా ఒక్కో రకమైన స్కెచ్ ఉందని చెప్పనక్కర్లేదు. తెలుగదేశం పార్టీకి మేలు చేయడమే లక్ష్యంగా లగడపాటి అలా మాట్లాడాడు. చివరకు జోకర్ అయిపోయాడు. అన్నింటికీ మించిన కామెడీ ఏమిటంటే గజ్వేల్ లో కేసీఆర్ కూడా ఓటమి బాటన పయనిస్తున్నాడని లగడపాటి ప్రకటించడం!

ఈ మాటలు నమ్మేసి.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. తనకు యాభైవేల మెజారిటీ అని ఆయన నిద్రలో కూడా కలవరించుకున్నాడు. చివరకు ఆ రేంజ్ మెజారిటీ కేసీఆర్ కు వచ్చిందిలే!

Show comments