అరె.. ఒక కామెడీని మిస్సవుతున్నామే..!

రాజకీయాలు సాధారణంగా సీరియస్ వ్యవహారం. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో నాయకులందరూ తమ తమ ప్రత్యర్థుల మీద నిప్పులు చెరుగుతూ చెలరేగిపోతూ ఉంటారు. వ్యవహారం అంతా హాట్ హాట్ గా ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడున్న వేసవి ఎండలకు తోడు, రాజకీయ వేడి కూడా చాలా అతిగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి సీరియస్‌నెస్, హీట్ మధ్యలో ప్రజలు అంతో ఇంతో కామెడీతో సేద తీరాలంటే.. ఎవరో ఒకరు కామెడీ పండించే నాయకుడు ఉండాలి. ప్రస్తుతానికి అలాంటి లోటు లేకుండా చేస్తున్న నాయకుడు కెఎ పాల్!

కెఎ పాల్ ఉండబట్టే తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు కాస్త భరించదగినట్టుగా కాస్త కామెడీతో నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. తెలంగాణ ప్రజలంతా తనను సీఎం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారంటూ ఆయన చేసిన కామెడీని ప్రజలు బాగానే ఆస్వాదించారు. తెలంగాణ సీఎం అయిపోయి ఎన్నెన్ని వరాలు కురిపించారో లెక్కలేదు.

ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో అంతకు మించిన కామెడీని నడిపిస్తున్నారు. అక్కడ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మొత్తం స్టేట్ లోని 175 నియోజకవర్గాల్లోనూ తానే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించడం ఆయనకే చెల్లింది. ముందుగా ఎన్డీయేను చంద్రబాబు ప్రాపకాన్ని వదలిపెట్టి, జనసేన పార్టీని తన ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసేసి తనతో చేతులు కలిపినట్లయితే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ఆహ్వానించిన పెద్దమనిషి ఆయన.

తనను ఏపీలో ముఖ్యమంత్రిగా గెలిపిస్తే.. రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న అప్పులు యాభైవేల కోట్ల రూపాయలు తీర్చేసి, అదనంగా అభివృద్ధి పనుల కోసం లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు ఒక నెలలో తీసుకువస్తానని హామీ ఇవ్వగల ధైర్యం ఆయనకు మాత్రమే ఉంది. అలాంటి ది గ్రేట్ పొలిటికల్ కమెడియన్ కెఎ పాల్ ఇప్పుడు తెలుగు ప్రజలను నిరాశపరుస్తున్నారు.

Readmore!

గాజువాక ఎమ్మెల్యేతో పాటు, విశాఖ ఎంపీగా కూడా బరిలో ఉన్న కెఎ పాల్, ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీచేయను అని అంటున్నారు. గెలిస్తే వంద రోజుల్లో పరిశ్రమలు తెచ్చేసి, ఉద్యోగాలు ఇచ్చేస్తానంటున్న ఆయన ఇప్పుడు ఓడితే ఇక ఏ ఎన్నికల్లోనూ కూడా పోటీచేయరట. అయ్యో తెలుగు రాజకీయాలకు ఎంత కష్టం వచ్చిందో కదా..!

వియ్ మిస్ యూ... కె ఎ పాల్! వియ్ మిస్ యూ!!

Show comments