బాప్, బేటా.. ఔర్ ‘పైసా వసూల్’

పూరి జగన్నాథ్‌ రూటే సెపరేటు. ఆయన సినిమాల్లో హీరోకి ఓ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ వుంటుంది. సినిమా ఎలా వున్నాసరే, హీరో క్యారెక్టరైజేషన్‌ విషయంలో పూరి జగన్నాథ్‌ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వున్నాడు. నాగార్జున లాంటి హీరోతో, 'నాక్కొంచెం మెంటల్‌..' అని చెప్పించడం పూరి జగన్నాథ్‌కే చెల్లింది. అది 'శివమణి' సినిమా నాటి మాట. మరిప్పుడు, బాలకృష్ణతో పూరి జగన్నాథ్‌ తెరకెక్కించబోతున్న సినిమా ఎలా వుండబోతోంది.? 

ఈ ప్రశ్నకు అతి త్వరలో సమాధానం దొరకబోతోంది. అదీ 'స్టంపర్‌' రూపంలో. స్టంపర్‌ అంటే ఏంటి.? ఈ ప్రశ్నకి సమాధానం 'టీజర్‌ కా బాప్‌' అని చెబుతున్నాడు పూరి జగన్నాథ్‌. అంతేనా, 'ట్రైలర్‌ కా బేటా' అని కూడా చెబుతున్నాడండోయ్‌. 'స్టంపర్‌ 101' అంటూ, ఈ నెల 28న విడుదల చేయనున్న 'పైసా వసూల్‌' ఫస్ట్‌ లుక్‌ వీడియోపై విపరీతమైన ఉత్కంఠను క్రియేట్‌ చేసేశాడు పూరి జగన్నాథ్‌. 

టీజర్‌ కా బాప్‌ అంటే.. టీజర్‌ కన్నా కాస్త ఎక్కువనీ, ట్రైలర్‌ కా బేటా.. అంటే ట్రైలర్‌ కన్నా కొంచెం చిన్నదనీ అనుకోవడం సహజమే. అయితే, ఇందులో బాలయ్యను పూరి ఎలా చూపించబోతున్నాడన్నదే కీ పాయింట్‌. 'అభిమానులకి మాటిస్తున్నా.. మీ అభిమాన హీరో ఎలా వుండాలని మీరు కోరుకుంటున్నారో, సినిమా అలాగే వుంటుంది..' అంటూ సినిమా ప్రారంభం రోజునే పూరి జగన్నాథ్‌ చెప్పేశాడు. మరి, ఆ చెప్పిన మాటకి పూరి కట్టుబడి వున్నాడా.? వేచి చూడాల్సిందే.

Show comments