బీజేపీ కూడా ఆ బురదలోకే..

ఫిరాయింపుల బురదలోకి బీజేపీ కూడా దిగిపోయింది. అఫ్‌కోర్స్‌.. ఆ బురద ఆ పార్టీకి ఎప్పుడో అంటేసినా, 'అలాంటి అనైతిక చర్యలకు బీజేపీ ఎప్పుడూ పాల్పడదు..' అంటూ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుకాయిస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. పైకి మాత్రం, బీజేపీని నీతివంతమైన పార్టీగా ప్రొజెక్ట్‌ చేసేందుకు వెంకయ్య పడరాని పాట్లూ పడ్తుండడం వెంకయ్యకి అలవాటే. 

ఇక, తాజాగా భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది.. అదీ మణిపూర్‌లో. మొన్న జరిగిన ఎన్నికల్లో మణిపూర్‌లో సంఖ్యాబలం పరంగా రెండో స్థానంలో నిలిచింది బీజేపీ. మొదటి స్థానంలో కాంగ్రెస్‌ నిలిచినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికిలపడింది. అసలు కాంగ్రెస్‌ ఆ ఛాన్స్‌ తీసుకోకుండానే, బీజేపీ తొందరపడిందక్కడ. గోవాలోనూ ఇదే పరిస్థితి. నిస్సిగ్గుగా బీజేపీ, గోవాలోనూ మణిపూర్‌లోనూ అధికార పీఠమెక్కిందన్నది నిర్వివాదాంశం. 

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడాల్సి వస్తే, వెంకయ్య ఎంత దారుణంగా ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఏపీ బీజేపీ నేతల్లో చాలామంది టీడీపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడాన్ని ప్రశ్నించేశారండోయ్‌. తెలంగాణలో సంగతి సరే సరి. మిత్రపక్షం టీడీపీని టీఆర్‌ఎస్‌ కొల్లగొడ్తుండడం పట్ల బీజేపీ అసహనం వ్యక్తం చేసింది. అప్పుడంతలా అసహ్యం ప్రదర్శించి, ఇప్పుడు అదే ఫిరాయింపు అనే రొంపిలోకి అధికారికంగా దిగిపోయింది బీజేపీ. 

మరిప్పుడు, వెంకయ్యనాయుడు మణిపూర్‌లోని పార్టీ ఫిరాయింపులపై ఏమంటారు.? అని టీడీపీ నేతలే వెంకయ్య స్పందన కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం. 'బీజేపీ ఇకపై పార్టీ ఫిరాయింపుల విషయంలో మమ్మల్ని విమర్శించే నైతిక హక్కుని కోల్పోయినట్లే..' అంటూ అప్పుడే పలువురు టీడీపీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానించేస్తున్నారు. మరి, వెంకయ్యగారి బుకాయింపులు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎలా వుండబోతున్నాయో వేచి చూడాల్సిందే.

Readmore!

Show comments