పవన్‌ కళ్యాణ్‌ను లాక్కొస్తున్నారు....!

చిన్న పిల్లలు బడికి వెళ్లకపోతే వారిని తల్లిదండ్రులు  బలవంతంగా లాక్కొని తీసుకుపోతుంటారు.  వెళ్లి తీరాల్సిందేనని హుకూం జారీ చేస్తారు. పిల్లలకేమో బడికి వెళ్లడం ఇష్టం ఉండదు. అయినా పెద్దవాళ్లు వినరు. అదే పనిగా అరుస్తారు. పవర్‌స్టార్‌ కమ్‌ జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌ పని ఇలాగే ఉంది. ఆంధ్రాలో ఏ సమస్య వచ్చినా ఛోటా నాయకులు మొదలుకొని తలపండిన నేతల వరకూ వెంటనే గుర్తొచ్చే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. ఆయనేమీ సీనియర్‌ రాజకీయ నాయకుడు, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడూ కాదు. ఇంకా సినిమా నటుడే. 

అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ సమస్య తలెత్తినా దానిపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేయడం అలవాటుగా మారింది. గల్లీ నాయకులో, 'మెగా' అభిమానులో డిమాండ్‌ చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. కాని వివిధ పార్టీల్లోని సీనియర్లు కూడా పవన్‌ స్పందించాలని కోరుతుంటారు. ఎవరెంత డిమాండ్‌ చేసినా, కోరుకున్నా పవన్‌ కళ్యాణ్‌ తాను మాట్లాడదల్చుకున్నప్పుడే మాట్లాడతాడు. చెప్పాలనుకున్నదే చెబుతాడు. చెప్పాల్సిన సమయంలోనే చెబుతాడు. మొదటినుంచి ఆయన వైఖరి చూస్తున్నవారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. కాని అదే పనిగా 'పవన్‌ మాట్లాడాలి' అని డిమాండ్‌ చేస్తూనే ఉంటారు. 

పోనీ మాట్లాడతాడే అనుకుందాం. దానివల్ల ఉపయోగమేమిటి?  ఆయన క్రియాశీల రాజకీయ నాయకుడు కాదు కదా. పదవి ఉన్నవాడు కాదు కదా. కాని ఆయన స్టేట్‌మెంట్‌ను పట్టుకొని కావల్సినంత రాజకీయం చేయొచ్చు. పవన్‌ అన్న కమ్‌ కాంగ్రెసు నాయకుడు చిరంజీవి మాట్లాడకపోయినా పట్టించుకునేవారులేరు. కాని పవన్‌ మాట్లాడకపోతే ప్రతిపక్ష నాయకులు ఆగ్రహంతో ఊగిపోతుంటారు. పవర్‌స్టార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రతిపక్షాల కోరిక. కాని పవన్‌ తెలివితక్కువవాడు కాదు కదా. ప్రతిపక్షాలు ఒత్తిడి చేసినంతమాత్రాన నోటికొచ్చింది మాట్లాడేస్తాడా? 

తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడినని కాదనే సంగతి ఆయనకు తెలుసు. ఇక అసలు విషయానికొస్తే...ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాపుల రిజర్వేషన్లకు, తుని విధ్వంసకాండకు సంబంధించి  మాజీ మంత్రి, తనను తాను కాపు జాతి రక్షకుడిగా ప్రకటించుకున్న ముద్రగడ పద్మనాభానికి-సీఎం చంద్రబాబుకు మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముద్రగడ లేచిందే లేడికి పరుగు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై కాంగ్రెసు హయాంలో నోరు మెదపని కాపు జాతి రక్షకుడు ఏపీ పుట్టెడు కష్టాల్లో ఉన్న విషయం తెలిసికూడా రిజర్వేషన్లను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. 

రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేయడంలో తప్పులేదు. కాని ఊపిరి సలపనివ్వకుండా అదొక్కటే అత్యంత ప్రధాన సమస్యగా వ్యవహరించడం సరికాదు. ఈ విషయంలో ముద్రగడ ఓవరాక్షన్‌ (ఆత్మహత్య చేసుకుంటానని) కూడా వెగటు పుట్టిస్తోంది. ఆంధ్రా కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అక్కడి నాయకులకు రాష్ట్రాభివృద్ధి అంత ముఖ్యం కాదు. చివరకు ఇప్పుడు  రిజర్వేషన్ల కంటే తుని విధ్వంసం ఘటన పెద్ద చర్చనీయాంశమైంది. దీని మీద సీబీఐ విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటిస్తే, వైకాపా అధినేత జగన్‌, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి ఓకే అన్నారు. కాని ముద్రగడ ఒప్పుకోవడంలేదు. 

కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్‌, ముద్రగడ ఒకే అభిప్రాయంతో ఉన్నారు. కాని సీబీఐ విచారణ విషయంలో దారులు వేరయ్యాయి. కాపు నాయకుడైన చిరంజీవి సీబీఐ విచారణకు ఓకే అన్నారు కాబట్టి నాయకులు తమ్ముడు పవన్‌ వెంట పడ్డారు. రిజర్వేషన్లు, తుని ఘటన విషయంలో ఆయన కూడా మాట్లాడాలని పట్టుబడుతున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశం పూర్తిగా ఆంధ్రాకు సంబంధించిన గొడవ. కాని తెలంగాణ కాంగ్రెసు నాయకుడు వీహెచ్‌ దీంట్లో ఎందుకు ఇన్‌వాల్వ్‌ అవుతున్నారో అర్థం కావడంలేదు. ఈ అంశంపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడాలని ఆయనా డిమాండ్‌ చేశారు. 

సీపీఐ నాయకుడు నారాయణ కూడా పవన్‌పై మండిపడ్డారు. ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ నాయకులు ఎంతగా గొంతు చించుకున్నా పవన్‌ పెదవి విప్పే అవకాశం లేదు. అతను కేవలం సినిమా నటుడిగానే ఉన్నట్లయితే రాష్ట్ర సమస్యలపై మాట్లాడాలని ఎవ్వరూ అడగరు. రాజకీయ పార్టీని ప్రకటించి, తనను రాజకీయ నాయకుడిగా, ప్రశ్నించే గొంతుకగా చెప్పుకున్నాడు కాబట్టే ఈ గొడవంతా. 'వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి ఇష్టం...పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం' అన్నారు కదా మహాకవి. 

Show comments