అమరావతి ప్రహసనం.. మళ్లీ మొదటికి!

అంతర్జాతీయ స్థాయి రాజధాని ఆకృతుల వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఆకృతుల ప్రహసనం గురించి నిన్న రాత్రి పొద్దు పోయాకా ఒక నిర్ణయానికి వచ్చారట! అదేమనగా.. మాకీ సంస్థ సమర్పించిన ఆకృతులను పూర్తిగా పక్కన పెట్టేసీ.. మళ్లీ అంతర్జాతీయ స్థాయి డిజైన్లకు ఆహ్వానాలు పలకాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది!

కొన్ని నెలల కిందట జపాన్ కు చెందిన మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లతో అమరావతి లో ముఖ్య నిర్మాణాలను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ డిజైన్లు ఏపీనే కాదు, పక్క దేశాలను కూడా భయపెట్టేశాయి. అమరావతి డిజైన్ల ను చూసిన కర్కశదేశం పాకిస్తాన్ కూడా దడుచుకుంది. ఆ పొగ గొట్టాలను చూసి.. ఇండియా తమ మీదే ఏ కాష్మోరానో ప్రయోగించబోతోంది.. అందుకే ఆ భవంతులను కడుతోంది అంటూ పాకిస్తానీ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.

అలా ఆ ప్రహసనం పీక్స్ కు వెళ్లినా.. అనుకూల మీడియా మాత్రం అదిరిపోయింది.. అనే వ్యాఖ్యానాలు ఒకటీ రెండ్రోజులు బండి లాగించింది. ప్రభుత్వం కూడా ఆ మేరకు తలూపుతూ.. ఆ విధంగా ముందుకు వెళ్లాలని చూసినా, కొన్ని నెలల పాటు  ఆ విషయంపై ఏ నిర్ణయం తీసుకోకుండా కాలం గడిపేసినా.. చివరకు ఏమనుకున్నారో ఏమో కానీ, ఇప్పుడు మాత్రం మాకీకి మంగళం పాడేయాలని డిసైడ్ చేశారట!

మొదట్లో ఆ డిజైన్లు అదిరిపోయాయని.. ప్రకటించిన ప్రభుత్వ మేళాలు, ఇప్పుడు  అవి పొగ గొట్టాల్లా ఉన్నాయన్న బయటి వాళ్ల అభిప్రాయాన్నే చెబుతున్నాయి. మరి మాకీకి మంగళం పాడేశారు సరే… మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చినట్టే కదా. అంటే.. కొన్ని నెలలు వెనక్కు వెళ్లినట్టే!  Readmore!

ఈ మధ్య సీఎంగారు వెళ్లి వచ్చిన ఆస్తానాతో సహా మిగిలిన విదేశాల ఫార్ములాన్నింటినీ చూశాకా.. మాకీ డిజైన్లు ఏ మాత్రం బాగోలేవని డిసైడ్ చేశారనే మాటా వినిపిస్తోంది. మరి మళ్లీ ఇప్పుడు విదేశీ సంస్థలతో డిజైన్లు గీయించుకోవడం, వాటన్నింటినీ పరిశీలించడం, వాటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయడానికే… దీనికి మినిమం ఏడాది పట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 

అంత సమయం గడిచాకా కూడా.. అప్పుడు సదరు విదేశీ విశ్వకర్మలు మాకీ తరహాలో ఏదో నవ్వుల పాలయ్యే డిజైన్ ను ఇవ్వరని గ్యారేంటీ ఏమైనా ఉందా? ఒకవేళ  ఆ డిజైన్లు కూడా నచ్చకపోతే..? ఆ తర్వాత మళ్లీ కథ మొదటికి వస్తుందా?

మళ్లీ డిజైన్లు వచ్చేలోపు.. ఏపీ సీఎం వేరే విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఆయా దేశాల విహారంలో ఆయన అబ్బుర  పరిచే నిర్మాణాలను చూస్తే? ఇంత వరకూ చూసిన వాటిలా కాదు, ఇకపై చూడబోయేవి ఆయనను ఆకట్టుకుంటే? సంతలో చిన్న పిల్లాడు ఒక బొమ్మ తర్వాత మరోదాన్ని చూసి.. తన ఎంపికలు మార్చుకొంటూ పోయినట్టుగానే కదా… ఇప్పటి వరకూ ఈ తతంగం కొనసాగుతున్నది? కాబట్టి.. ముందు ముందు ఈ ప్రహసనంలోని పసందులను గమనిస్తూ ఉండటమే ఆంధ్రుల ఈ ప్రహసనంతో హైడ్రామా నడిపిస్తూ జనాలను ఫూల్స్ చేస్తూపోవడం అనుకూల మీడియా పని! 

Show comments