కరుణానిధిలా పదవులు పట్టుకు వేలాడం!

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, విశాఖ జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉన్నట్లుండి పొరుగు రాష్ట్రానికి చెందిన రాజకీయ కురు వృద్ధునిపై ఈ రకమైన సెటైర్లు వేశారేంటని అనుమానం వచ్చినా ఆసలు విషయం మాత్రం వేరుగా ఉంది. సొంత పార్టీలో పలువురికి ఝలక్‌ ఇచ్చేలా అయ్యన్న వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

విశాఖలో ఇటీవల మీడియాతో అయ్యన్న మాట్లాడుతూ, పదికాలాల పాటు పదవులు పట్టుకుని పోవాలని తనకైతే ఏ కోరికా లేదని తేల్చేశారు. తాను మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో ఉంటూ కీలకమైన మంత్రిత్వశాఖలను నిర్వహించానని, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తనవరకైతే రాజకీయంగా పూర్తి సంతృప్తి ఉందని అంటూ తొంబయ్యేళ్ల వయసులోనూ ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధిలా పదవులను కోరుకోవడం ఎవరికీ న్యాయం కాదని అన్నారు.

అయ్యన్న ఈ రకమైన మాటలను ఊరికే అనలేదని, చాలా ముందు చూపుతోనే అన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2019 నాటికి తన కుమారున్ని రాజకీయ వారసునిగా తెరపైకి తేవడంతో పాటు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలన్నది అయ్యన్న అభిమతంగా ఉందంటున్నారు. పనిలో పనిగా తాను ఒక్కడినే కాకుండా, తనతోపాటు, సొంత పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులు ఇలాగే క్రీయాశీల రాజకీయాలకు దూరం కావాలన్నది అయ్యన్న ఆలోచనేమో.

మరో మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడమే కాదు, మరిన్ని ఎన్నికలలోనూ పాలుపంచుకోవాలనుకుంటున్నారు. అటువంటి వారికి ఝలక్‌ ఇచ్చేలాగా, ఇంకో వైపు అధినాయకత్వానికి కూడా మేలైన సూచన ఇచ్చినట్లుగానూ ఉభయ తారకంగా అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.

Readmore!

ఆయనకైతే ఈసారి పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం లేదు, పైగా కుమారున్ని తెచ్చుకుంటున్నారు, తన వరకూ బాగా సర్దుకుని ఇతరులకు రాజకీయ నీతులు చెప్పడమేమిటని సొంత పార్టీలో ప్రత్యర్ధి వర్గం అపుడే గరం గరం అంటోంది. అధినాయకత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే అయ్యన్న ఉన్నట్లుండి ఈ వ్యాఖ్యలు చేశారంటే రేపటి ఎన్నికలలో సీనియర్లకు టిక్కెట్లు నిజంగా ఇస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమేనని పార్టీలో చర్చించుకుంటున్నారు.

Show comments