విదేశాలకు చెక్కేసిన కాంగ్రెస్‌?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించడమే కాక కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోతుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ముందుగానే తెలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాహుల్‌-అఖిల్‌ కాంబినేషన్‌ క్లిక్‌ కావడంలేదని, మోడీకి పెద్దఎత్తున జనాదరణ లభిస్తుందని కాంగ్రెస్‌ అంతర్గత సర్వేలో తేలింది. సోనియా తనయ ప్రియాంక గాంధీ కూడా ముందుగా యూపీ అంతా ప్రచారం చేయాలని భావించినా పరిస్థితి గమనించి వెనక్కు తగ్గారు. ఫలితాలు మరో మూడురోజులు ఉందనగానే సోనియాగాంధీ అనారోగ్యం పేరుతో విదేశాలకు వెళ్లారు. ఫలితాలు వచ్చిన మరో మూడురోజుల తర్వాత ఆమె తనయుడు రాహుల్‌గాంధీ కూడా తల్లిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడే వారు భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించుకునే అవకాశం ఉన్నది. పార్టీ నడపడం నీవల్ల కాదు.. ప్రియాంకకు అప్పజెబుదాం.. అని సోనియా రాహుల్‌కు చెబుతారా అని పలువురు నేతలు ఆశగా చూస్తున్నారు. పుత్ర ప్రేమ వల్ల పార్టీ దెబ్బతిన్నదని వారు భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పలువురు కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు విదేశాల్లోనే కాలం గడుపుతున్నారు.

అంతర్గత తగాదాలే కాంగ్రెస్‌ బలహీనత
కాంగ్రెస్‌కు అన్నిటికన్నా ఎక్కువ నష్టం కలిగించేది ఆ పార్టీ అంతర్గత తగాదాలే. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ సమైక్యంగా లేదు. ఉత్తరప్రదేశ్‌లో షీలా దీక్షిత్‌ను ముందు రంగంలోకి దించాక ఆమె వల్ల లాభం లేదని పలువురు చెప్పడంతో రాహుల్‌ అఖిలేశ్‌తో చేతులు కలిపారు. షీలాకూ, గులాంనబీ ఆజాద్‌కూ ఉన్న తగాదాలే కారణం. ఇంతకాలం తాను పోరాడిన అఖిలేష్‌తో చేతులు కలపడంతో కాంగ్రెస్‌ పీసీసీ అ్యధ్యక్షురాలిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన రీటా బహుగుణ బీజేపీలో చేరారు. షీలాకు, రీటాకు పడకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. చివరకు దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేతలు కూడా యూపీలో నేతల మధ్య చిచ్చు పెట్టారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఎన్నికల 18 నెలలుందనగా, ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య పోటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి పదవిని ప్రకటించాలని సింధియా భావిస్తే అలాంటిదేమీ అవసరంలేదని కమల్‌నాథ్‌ అంటున్నారు. తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి కోసం పది మంది రంగంలోకి దిగడంతో జనం అసహ్యించుకుని అందర్నీ ఓడించిన విషయం తెలిసిందే.

Show comments