జనసేన.. జగన్‌ వైపేనా.!

రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఈక్వేషన్‌ ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు.? నిన్న మొన్నటిదాకా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ప్రతిపక్షం వైఎస్సార్సీపీపై సెటైర్లు వేశారు.. వెటకారాలతో సందడి చేశారు. జగన్‌ తక్కువేమీ తిన్లేదు.. పవన్‌కళ్యాణ్‌ మీద కామెంట్లేశారు.. కౌంటర్లతో ఎంటర్‌టైన్‌ చేశారు. ప్రతి విషయంలోనూ అధికార పార్టీకి పవన్‌ వత్తాసు పలుకుతుండడాన్ని జగన్‌ వెటకారం చేయడాన్ని ఎలా తప్పు పట్టగలం.? అదే సమయంలో, టీడీపీకి మిత్రపక్షం గనుక.. పవన్‌ - చంద్రబాబు భజన చేయడాన్నీ తప్పు పట్టలేం. 

కానీ, ఇప్పుడిప్పుడే.. ఇటు పవన్‌కళ్యాణ్‌కీ, అటు వైఎస్‌ జగన్‌కీ తత్వం బోధపడ్తున్నట్లుంది. 'ప్రజా సమస్యల పోరాటంలో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేయడానికి సిద్ధం.. అది వైఎస్సార్సీపీతోనయినాసరే..' అని ఓ సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో, వైఎస్సార్సీపీ నుంచీ సానుకూల 'పవనా'లు షురూ అయ్యాయి. అఫ్‌కోర్స్‌, 'చంద్రబాబు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌.. అనే పవన్‌కళ్యాణ్‌ గురించి ఏం మాట్లాడగలం.?' అని జగన్‌ ఈ మధ్యన కూడా ఓ కౌంటర్‌ వేశారనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, పవన్‌ చిత్తశుద్ధితో ముందుకొస్తే, అతనితో కలిసి పనిచేస్తామన్నారు వైఎస్‌ జగన్‌. 

ఇంకేముంది.. ఇప్పుడీ రెండు పార్టీల మధ్యా 'సానుకూల వాతావరణం' షురూ అయ్యేలా వుంది. పార్టీ ఫిరాయింపుల అంశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలపై జనసేన పార్టీ పెదవి విప్పింది. ఆ పార్టీ తరఫున ఈ మధ్యకాలంలో కాస్త గట్టిగా మీడియా ముందు మాట్లాడుతున్న కళ్యాణ్‌ (పవన్ కళ్యాణ్ కాదండోయ్..), 'ఈ విషయంలో మేం వైఎస్సార్సీపీకి మద్దతుగా మాట్లాడతాం.. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం..' అంటూ ఓ ఛానెల్‌ చర్చా కార్యక్రమంలో స్పందించారు. ఏపీలో మీడియా, చంద్రబాబుకి భయపడుతున్న వైనాన్నీ ప్రశ్నించేశారాయన. ప్రతిపక్షం బాధ్యత అధికార పక్షాన్ని ప్రశ్నించడమేననీ, ఈ విషయంలో ప్రతిపక్షంతో కలిసి పనిచేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని కళ్యాణ్‌ చెబుతున్నారు. ఇదే 'టోన్‌' జనసేనాధినేత పవన్‌కళ్యాణ్‌ నుంచీ వస్తే, ముందు ముందు జనసేన - వైఎస్సార్సీపీ కలిసి ముందడుగు వేసే అవకాశాలైతే సుస్పష్టం. 

కానీ, పవన్‌ - జగన్‌.. రాజకీయంగా భిన్న ధృవాలు. పైగా, రాజకీయాలపై ఓ నిబద్ధత అంటూ లేని వ్యక్తి పవన్‌కళ్యాణ్‌. అక్కడే వస్తోంది సమస్య అంతా.! చూద్దాం.. ముందు ముందు రాజకీయాలు ఎలా మారబోతున్నాయో, 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చిన జనసేన, 2019 ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీతో జతకడ్తుందో లేదో కొన్నాళ్ళాగితే తేలిపోతుంది కదా.!

Show comments