రజనీ అభిమానులకిదే అసలైన దీపావళి

తమిళ సినీ పరిశ్రమకి దీపావళి పెద్ద పండుగ. తమ అభిమాన హీరోల సినిమాలు దీపావళికి విడుదల కావాలని అక్కడి సినీ అభిమానులు కోరుకోవడం, ఆ కోరికని మన్నించి తమ సినిమాల్ని దీపావళికి తీసుకొచ్చేందుకు చాలామంది తమిళ హీరోలు పోటీ పడ్తుండడం తెల్సిన విషయమే. 

ఆ సంగతి అటుంచితే, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు అరుదైన దీపావళి కానుక అందించాడు. అయన ప్రెజెన్సే పెద్ద బహుమతి మరి. ఎందుకంటే, రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్ళి చాలా రోజులు అక్కడే చికిత్స తీసుకుని వచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత మరోసారి ఇటీవలే విదేశాలకు వెళ్ళిన రజనీకాంత్‌, తాజాగా తిరిగొచ్చారు. తిరిగి వస్తూనే, అభిమానుల్ని కలిశారు రజనీకాంత్‌. ఇంకేముంది, అభిమానులు పండగ చేసుకున్నారు. 

తన తాజా చిత్రం 'కబాలి' వంద రోజులు పూర్తి చేసుకోవడంతో, రజనీకాంత్‌ తన అభిమానుల్ని తన ఇంటికి ఆహ్వానించారట. అలా వచ్చిన అభిమానులతో రజనీకాంత్‌ దీపావళి పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. అదీ అసలు విషయం. రజనీకాంత్‌ని కలిశామన్న ఆనందం, అంతకు మించి.. రజనీకాంత్‌ ఆరోగ్యంగా వున్నారనే సంతోషం.. వెరసి, అభిమానుల సందడికి హద్దే లేకుండా పోతోంది. రజనీకాంత్‌ అతి త్వరలో 'రోబో 2.0' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.

Show comments