అబద్దాల వాగ్ధానాలు చేసే నేతలకు కళ్లెం పడుతుందా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ మౌలికమైన విషయాన్ని లేవనెత్తారు. ఎన్నికల సంస్కరణలో కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాజకీయ పార్టీలు, నేతలు ఎన్నికల మేనిపెస్టోలలో, ప్రచారంలో అనేక వాగ్ధానాలు చేసి, ఆ తర్వాత విస్మరిస్తున్న తీరును నిర్మొమహాటంగా చెప్పారు. రాజకీయ పార్టీలను, నేతలను వారు చెసే వాగ్ధానాలకు బాధ్యులను చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్దంలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన భావించారనుకోవచ్చు. ఆయన చేసిన అర్ధవంతమైన ఈ ప్రసంగం రాజకీయ నాయకులకు రుచించకపోవచ్చు. ఇది ఇవ్వాళ కొత్తగా వచ్చిన సమస్య కాకపోవచ్చు. గతంలో నుంచి ఉన్న విషయమే. ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చిన తర్వాత మొత్తం పేదరికం పోతుందని నమ్మినవారు ఉన్నారు. అలాంటి జనరల్‌ నినాదాలు ఒకఎత్తు అయితే ఇటీవలికాలంలో ప్రజల ఓట్లను ఆకర్షించడానికి పార్టీలు, నేతలు వందల కొద్ది వాగ్దానాలు చేస్తున్న తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అయినా ప్రజలు బలహీన మనస్తత్వం కలిగినవారు.

పేదరికంలో అత్యధిక శాతం మగ్గుతుండడంతో చిన్న చిన్న ఆశలకు కూడా లొంగిపోతున్నారు. స్వార్థపరులైన నేతలు వారిని విజయవంతంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చివరికి ఎన్నికల సంఘం కాని, న్యాయవ్యవస్థ గాని ఏమి చేయలేకపోతున్నాయి. ఉదాహరణకు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేసిన వందల కొద్ది వాగ్ధానాలపై ఎన్నికల కమిషన్‌ ప్రశ్నలు వేయకపోలేదు. కాని తాము చేసేస్తామని ఆనాడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే ఎన్నికల కమిషన్‌ సరిపుచ్చుకుంది. ఆ తర్వాత ఏమి చేశారో, ఏమి చేయలేదో అన్నదానిపై ఎన్నికల సంఘానికి పట్టలేదు. ముఖ్యంగా రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని, ఆడవాళ్ల బంగారు నగలన్నిటిని బ్యాంకుల తాకట్టు నుంచి విడిపిస్తామని చంద్రబాబు వాగ్ధానం చేశారు. దానిని నమ్మి అనేక మంది కొత్త అప్పులు కూడా చేశారు. అలాగే డ్వాక్రా రుణాలన్నిటిని రద్దు చేసేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఆడపిల్లలందరికి సెల్‌పోన్‌లు అన్నారు. కులాల వారీగా హామీలు గుప్పించారు. సింగపూర్‌ అంతటి రాజధాని నిర్మిస్తామని చెప్పేశారు. వాటిలో ఎన్ని నెరవేరాయన్నది వేరే చెప్పనవసరం లేదు. రుణమాఫీ సజావుగా జరగక రైతులకు మరిన్ని అప్పులు తోడయ్యాయి. సింగపూర్‌ చేస్తారంటే భూములన్ని సింగపూర్‌ వారికి కట్టబెడతారన్న సంగతి అప్పుడు ప్రజలకు తెలియలేదు. ఇప్పుడు వీటన్నిటిపైన ఆయన డబాయిస్తున్నారు.

టీడీపీ, బీజేపీ కలిసి ప్రత్యేక హోదా తెచ్చేస్తున్నామని ప్రచారం చేశాయి. ఆ తర్వాత ప్యాకేజీ అంటూ నిస్సిగ్గుగా మాట మార్చాయి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల మానిఫెస్టోలో కాకపోయినా, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిన వైనాన్ని అంతా గుర్తు చేస్తుంటారు. కరీంనగర్‌ను లండన్‌ చేస్తా, హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామని, కేజీ టూ పీజీ ఉచిత విద్య.. ఇలా అనేక వాగ్ధానాలు చేశారు. ప్రధాని మోడీ సైతం విధేశాలలో ఉన్న నల్లధనాన్ని తెచ్చేస్తామన్నారు. అదంతా వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల చొప్పున వస్తుందనుకుంటే అంతడబ్బు తమకే దక్కుతుందని జనం అంతా అనుకున్నారు. ఇలాంటి వాటిపై కట్టడి లేకపోతే, నేతలు, రాజకీయపార్టీలు ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తూనే ఉంటాయి. ఎన్నికలలో గెలవడానికి ఎలా మోసం చేయాలన్న ఆలోచన, ఆ తర్వాత వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి అబద్ధాలు ఆడాలన్న దానిపై మరో ఆలోచన చేయడం పాలకులకు అలవాటుగా మారింది. 

ఈ విధ్యలో చంద్రబాబుది రికార్డే అని చెప్పాలి. ఛీప్‌ జస్టిస్‌ ఖేహార్‌ అన్నట్లు ఇలాంటి వాటికి మోక్షం కలగకపోతే నేతలు నిత్యం ప్రజలు మోసపోతూనే ఉంటారు. నిజాలు చెప్పే నేతలు తాము ఎందుకు నష్టపోవాలిలే అనుకుని వారు కూడా అదే పందాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. చివరికి భారత సమాజం, రాజకీయ వ్యవస్థ అంతా అబద్దాల సమాజంగా మారిపోతుంది. అది జరగనివ్వకుండా న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఈ మాత్రం గట్టిగా మాట్లాడినందుకు ఖేహార్‌కు అభినందనలు చెబుదాం.

Readmore!

కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments