ఎమ్బీయస్‌: విమర్శించాలంటే పార్టీ పెట్టాలా? - 2/2

స్వాతంత్య్రపోరాటకాలంలో నెహ్రూ ప్రసంగాలు చేసేవాడు - 'మాకు అధికారం వచ్చాక బ్లాక్‌మార్కెటీర్లను అందుబాటులో వున్న కరంటు స్తంభానికి ఉరి తీస్తాం' అని. స్వాతంత్య్రం వచ్చాక ఒక్క బ్లాకుమార్కెటీరు అలా ఉరికంబానికి వేలాడలేదు. వాళ్లే కాదు, అన్ని రకాల అక్రమ వ్యాపారస్తులు కాంగ్రెసు పార్టీకి ఆప్తులయిపోయారు. తెలంగాణ ఉద్యమకాలంలో కెసియార్‌, ఆయన అనుచరులు రామోజీ ఫిల్మ్‌ సిటీ గురించి, పద్మాలయా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రాఘవేంద్రరావు కాంప్లెక్సు, నాగార్జున కన్వెన్షన్‌ హాలు, ఐ మాక్స్‌, అయ్యప్ప సొసైటీ యిలా అనేక వాటి గురించి మాట్లాడుతూండేవారు. ఇవన్నీ ఎన్నో అక్రమాలు చేశాయని, ఆంధ్రులు నడిపే ప్రభుత్వంలో వీరి కారణంగా తెలంగాణ ప్రజలు నష్టపోయారని అనేవారు. ఇప్పుడు ప్రభుత్వంలో తెలంగాణ వారే వున్నారు. వీరిపై చర్యలు తీసుకున్నారా? లేదే! పైగా వాళ్లకు కొత్తకొత్త వరాలు యిస్తున్నారు. ఎందుకు? ఆంధ్రులు చెఱువులు కబ్జా చేశారని తెగ చెప్పేవారు. ఇప్పుడు మిషన్‌ భగీరథ సందర్భంగా చెఱువుల ఆక్రమణదారులెవరో తేలి వుంటుంది కదా. వాళ్ల పేర్లు బయటపెట్టలేదేం? ఆంధ్ర విద్యాసంస్థలు తెలంగాణ విద్యార్థులను దోచుకు తింటున్నాయని హరీశ్‌ రోజూ చెప్పేవారు. వారిని అరికట్టడానికి యీ రెండేళ్లలో ఏం చేశారు? ఏమీ చేయకపోతే దాని అర్థం వాళ్లు అక్రమాలు చేయలేదనేనా? మరి అప్పటి మీ ఆరోపణల మాటేమిటి? ఆంధ్రప్రాంతపు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాదు పర్యావరణాన్ని నాశనం చేశారని తెగ వూదరగొట్టారు కదా. మీరు వచ్చాక వారిని ఎలా దండించారు? ఆంధ్రులు కదాని దండించనక్కరలేదు. ఆ కారణంతో వదలనూ అక్కరలేదు. అక్రమాలు చేసినవారు ఏ ప్రాంతం వారైనా సరే వారిని వదిలిపెట్టం అని ఆచరించి చూపినప్పుడు కదా, తెరాసపై నమ్మకం చిక్కేది. 

సమైక్యరాష్ట్రంలో ఏ ఒప్పందం జరిగినా పారదర్శకత లేదు, ఆంధ్రులకు కాంట్రాక్టులు యిచ్చేరు అని వివాదం చేసేవారు. ఇప్పుడు జరుగుతున్నదేమిటి అనే విషయంపై జాక్‌ అధ్యయనం చేయసాగింది. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, వాటర్‌గ్రిడ్‌ టెండర్లు, టెండర్ల పారదర్శకత, వాటిని దక్కించుకున్న కంపెనీలు, ఆ కంపెనీల యాజమాన్యాలు వంటివి యిప్పటికే స్థూలంగా అధ్యయనం చేసింది. తెలంగాణ సర్కారు కొనుగోలు చేసిన పోలీసు వాహనాలు, వాహనాలను సరఫరా చేసిన కంపెనీలు ఏ ప్రాంతానికి చెందినవనే దానిపై కూడా చేసింది. పాఠ్యపుస్తకాలు సరఫరా చేసిన కంపెనీలు, జిఎచ్‌ఎంసి సప్లయి చేసిన చెత్త డబ్బాలు తయారు చేసిన కంపెనీలు ఎవరివి, ఏ ధరకు కొన్నారు అనేది తరచి చూస్తున్నారు. సప్లయిదారుల్లో తెలంగాణ వారెవరు? తక్కినవారెవరు? అని పట్టిపట్టి చూస్తున్నారు. ఇది తెరాసకు యిబ్బంది కలిగించే అంశం. ఉద్యమంలో వుండగా ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఓట్ల దగ్గరకు, నోట్ల దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రుల దగ్గర కొనము అని బాహాటంగా అనడానికి లేదు. ఆంధ్ర మూలాల వారి ఓట్లు, ఆంధ్ర పారిశ్రామికవేత్తల, కాంట్రాక్టర్ల నోట్లు ప్రతి పార్టీకి అవసరమే కాబట్టి ఏ పార్టీయైనా గట్టిగా దీని గురించి మాట్లాడలేదు. అలాటి ఎన్నికల మొహమాటం లేని స్వచ్ఛంద సంస్థలు మాత్రమే దీనిపై యాగీ చేయగలవు. 

తెలంగాణ ఉద్యమకాలంలో తెరాసకు మద్దతు యిచ్చిన మేధావి వర్గాలు విద్యుత్‌ ఒప్పందాలపై, సాగునీటి ప్రాజెక్టులపై కెసియార్‌ నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందాల రూ. 900 కోట్ల భారం పడుతుందని, మణుగూరు పవర్‌ ప్లాంట్‌ వలన 20 ఏళ్లలో కలిగే నష్టం రూ. 10 వేల కోట్లు అని, దామరచర్ల వలన రూ. 6 వేల కోట్లు నష్టమని విద్యుత్‌ ఉద్యోగుల ప్రతినిథి రఘు వాదిస్తున్నారు. ఉద్యమకాలంలో ఆయన్ని ఒక హీరోగా చూసిన తెరాస, యిప్పుడు ఆయనలో విలనీయే చూస్తోంది. ఇప్పుడు ఆయన కోదండరాంతో కలిసి విద్యుత్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక అధ్యయనం చేశాం, సెమినార్లు ఏర్పాటు చేస్తాం, పవర్‌పాయింటు ప్రజంటేషన్లు యిచ్చి ధననష్టం, పర్యావరణ నష్టం గురించి ప్రజలను మేల్కొల్పుతాం అంటున్నాడు. అలాగే యిరిగేషన్‌ ప్రాజెక్టులను కెసియార్‌ చిత్తం వచ్చినట్లు మార్చేయడాన్ని అనేక ప్రజా సంఘాలు, నిపుణుల వేదికలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా కెసియార్‌ పట్టించుకోవటం లేదు. 

ఇప్పుడు మల్లన్న సాగర్‌ గొడవ వచ్చింది. దాని కింద 21 వేల ఎకరాల భూమి కావాలి. 14 గ్రామాలు మునుగుతాయి. నిర్వాసితులు తమ భూమిని 2013 నాటి కేంద్ర భూ సేకరణ చట్టం తీసుకోమని అడుగుతున్నారు. దాని ప్రకారమైతే మార్కెట్‌ విలువ కంటె మూడు రెట్లు (ఎస్సీ, ఎస్టీల కైతే 4 రెట్లు) పరిహారం యివ్వాలి. పైగా మరో చోట స్థలాన్ని చూపించి ఇందిరమ్మ యిళ్లలాటివి కట్టించి యివ్వాలి. నాలుగేళ్ల పాటు ఆ భూమిని వినియోగించకపోతే వెనక్కి యిచ్చేయాలి. అవన్నీ యివ్వడం యిష్టం లేని రాష్ట్రప్రభుత్వం 2015 జులైలో జీవో 123 తెచ్చింది. దాని ప్రకారం మార్కెట్‌ ధర యిచ్చేస్తే చాలు. పునరావాసం గట్రా వాళ్లే చూసుకోవాలి. వెనక్కివ్వడాలుండవు. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు యింటికి రూ.5.04 లక్షలు, పొలానికి ఎకరానికి రూ.5.95 లక్షలు యిస్తామన్నారు. కోదండరాం మార్కెట్‌ రేటు  ఎకరా 8-10 లక్షలు పలుకుతుంటే 5,6 లక్షలు యిస్తాననడమేమిటి? అని అడుగుతున్నారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్‌ ముంపు బాధిత గ్రామాల్లో పర్యటిస్తూ వారికి మద్దతుగా మాట్లాడుతూ 'గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు గ్రామాల మీద పడతారా? 50 టిఎంసిల నీటి కోసం 14 ఊళ్లు ముంచాలా? ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ చేస్తారా? 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం యివ్వాలి. జీఓ తెచ్చి ప్రజల్ని వేధించకూడదు.' అని  చాలా తీవ్రంగా మాట్లాడారు. Readmore!

ఇవే మాటలు ప్రతిపక్షాలంటే వాటికంత ప్రభావం వుండదు. కానీ స్వచ్ఛంద సంస్థ అనడంతో వేల్యూ వచ్చింది. అంతకుముందే జాక్‌ కరువుపై 4 జిల్లాల్లో తిరిగి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక యిచ్చింది. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసి కోర్టుకి వెళ్లింది. సింగరేణిలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను గట్టిగా చెప్పింది. నిజాం సుగర్స్‌ తిరిగి తెరవాలన్న డిమాండ్‌ చేసింది. నిజానికి యివన్నీ గతం ప్రభుత్వహయాంలో తెరాస నాయకులు చేసిన డిమాండ్లే. తాము అధికారంలోకి రాగానే మర్చిపోయారు. కానీ అప్పుడు పోరాటాలు చేసిన రఘు, వేణుగోపాల్‌, హరగోపాల్‌ వంటి ఉద్యమకారులు మర్చిపోలేదు. వాళ్లంతా సమావేశమై 'అభివృద్ధి తెలంగాణ ఆదాయంలో 13% గ్రామాలది, 87% జిఎచ్‌ఎంసిది. ఇప్పటికీ అభివృద్ధి హైదరాబాదు చుట్టూనే జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన గొప్పగా పని చేస్తున్నట్లు అర్థం కాదని, మీడియా సరిగ్గా పనిచేయటం లేదని..' యిలా విమర్శించారు. జాక్‌ తరఫున దళితులకు మూడెకరాల భూమి, కేజి టు పిజి, ఉద్యోగ నియామకాలు, రైతు రుణమాఫీ, వ్యవసాయ అనుబంధ సమస్యలు యిత్యాది సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచుతామన్నారు. 

వీళ్లకు ఉద్యమకారులుగా తెలంగాణలో విశ్వసనీయత వుంది కాబట్టి, వీరి నివేదికలు బయటకు వస్తే ప్రజలు నమ్మవచ్చనే భయం తెరాసకు వుంది. అందువలన వారిని భయపెట్టడానికే కోదండరాంపై యింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఆ పడడంలో కోదండరాం లేవనెత్తిన ఒక్క పాయింటుకూ సమాధానం చెప్పలేదు. ఎంతసేపూ తాము తలపెట్టిన పథకాల గురించి, తమ ఎన్నికల విజయాల గురించే ప్రస్తావిస్తున్నారు. 60 ఏళ్ల దుష్పరిపాలనను దిద్దడానికి రెండేళ్లు సరిపోతుందా? అంటున్నారు. ఎన్నేళ్లు సరిపోతుందో చెప్పటం లేదు. పాత అక్రమాలు పక్కన పెట్టి యిప్పుడు వారు చేస్తున్న తప్పులపై సంజాయిషీ చెప్పాలి.ఆ పాయింటునే కోదండరాం పట్టుకున్నారు. 'మేం అడిగేది తప్పయితే ఎలా తప్పో చెప్పాలి. పారదర్శకత పెంచడానికి సర్కారు చేపట్టే పథకాలు, ప్రాజెక్టుల డిపిఆర్‌లు వెబ్‌సైట్లలో పెట్టి ప్రజల ముందు వుంచాలంటున్నాం. తప్పా? ఉద్యోగులకు చేసినట్లే తక్కిన ప్రజలకూ మేలు చేయాలని, ప్రయివేటు విద్యాసంస్థలపై నియంత్రణ వుండాలనీ అనడం తప్పా? తెలంగాణ యూనివర్సిటీలలో విసిలు లేరని చెప్పడం తప్పా? తెరాస వచ్చిన రెండేళ్లలో కొన్నింట్లోనే ఫలితం దక్కింది. ముఖ్యంగా తెలంగాణ ంటూ నాయకత్వం ఎదగడానికి అవకాశం కలిగింది. కానీ ప్రజల జీవనోపాధి అవకాశాలు పెరగలేదు. వాటి గురించి అడుగుతున్నాం. జవాబు చెప్పండి.' అంటున్నారు.

ఆ సమాధానం తెరాస నుంచి రావటం లేదు. కోదండరాంను ప్రజాద్రోహిగా ముద్ర కొడుతున్నారు. వీళ్లేమన్నా సరే మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు ఆయన దేవుడిలా కనబడతాడు. కెసియార్‌ తలపెట్టిన అనేక యిరిగేషన్‌ ప్రాజెక్టుల కారణంగా యిళ్లు, పొలాలు పోగొట్టుకునేవారందరూ ఉద్యమించడం మొదలుపెడతారు. వాళ్లందరూ పిలకలు ఎగరేయకుండా వుండాలంటే జాక్‌ను, ప్రజా సంఘాలను కట్టడి చేయాలని తెరాస సర్కారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం కోదండరాం ఆస్ట్రేలియా పర్యటిస్తున్నారు. అక్కడున్న తెలంగాణ ఎన్నారైలకు కోదండరాంపై నమ్మకం పోలేదు. పది రోజుల పర్యటనను స్పాన్సర్‌ చేస్తున్నారు. తెరాసతో గొడవ పెట్టుకున్నారు కదాని టూరు కాన్సిల్‌ చేయలేదు. తిరిగి వచ్చాక కోదండరాం ఉద్యమం కొనసాగిస్తారో, చల్లబడతారో తెలియదు. కొనసాగిస్తే మాత్రం తెరాసకు తలనొప్పి తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వాలకు, తెరాస ప్రభుత్వానికి మౌలిక స్వభావంలో తేడా ఏమీ కనబడటం లేదు. డబ్బున్నవాళ్ల మాట అప్పుడూ నెగ్గింది, యిప్పుడూ నెగ్గుతోంది. ఒకప్పుడు దుమ్మెత్తి పోసిన వాళ్లందరినీ తెరాస అక్కున చేర్చుకుంటోంది. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు అర్థమయిననాడు వాళ్లు పెదవి విరవడం మొదలుపెడతారని తెరాస భయపడడంలో ఆశ్చర్యం ఏముంది? - (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

mbsprasad@gmail.com

Click Here For Part-1

Show comments