చంద్రనీతి: రాజీనామా చెయ్యాల్సిందెవరు.?

కడప ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలవడం, వైఎస్సార్సీపీ చేజార్చుకోవడంతో.. ఆ జిల్లాలో వైఎస్సార్సీపీ కంచుకోట బద్ధలయ్యిందని తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్తంత అత్యుత్సాహంతో, 'వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన ఎమ్మెల్యేలతోపాటుగా రాజీనామా చేసి, తన బలమేంటో నిరూపించుకోవాలి..' అనేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల కూడా తమదేనని తెగేసి చెప్పేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా, పులివెందులలో గెలిచేస్తామనే ధీమా వ్యక్తం చేసేశారు. 

నిజమే, కడప ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. కడప మాత్రమే కాదు, కర్నూలు, నెల్లూరుల్లో కూడా టీడీపీదే విజయం. ఈ మూడు స్థానాల్లోనూ గెలిచే బలమున్నా వైఎస్సార్సీపీ ఓడిపోయింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ డబ్బు వెదజల్లిన వైనం సుస్పష్టం. అయినాసరే, గెలుపు గెలుపేనని అనుకోవాలేమో.! 

మూడు జిల్లాల్లో టీడీపీ హవా 'స్థానిక సంస్థల కోటా' వరకు బేషుగ్గా వుందనే అనుకుందాం. కానీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం మాటేమిటి.? చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే టీడీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. మొత్తం ఆరు జిల్లాల్లో (అనంతపురం, కడప, కర్నూలు - చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరి, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా.? చెప్పడానికే నీతులు తప్ప, పాటించడానికి కాదు గనుక, చంద్రబాబు ఇప్పుడు నోరెత్తరు. 

పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేని చంద్రబాబుకి, వైఎస్‌ జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసే నైతిక హక్కు ఎక్కడిది.? నిన్న అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు చాలా హడావిడి చేశారు. మరి, ఈ రోజు ఆయన ఏం చేస్తారు.? మీడియా ముందుకు రావాల్సి వస్తే, ఏం మాట్లాడతారు.? అసలు ఈ ఎన్నికలతో తమకు సంబంధం లేదని తప్పించుకు తిరిగేందుకు ప్రయత్నిస్తారా.? వేచి చూడాల్సిందే.

కొసమెరుపు: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసింది వందల మంది ఓటర్లు మాత్రమే. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసింది వేలాది మంది. ఆ లెక్కన, టీడీపీ ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఎలా అనుకోగలం.? అధికార పక్షం ఉపయోగించిన అధికార బలాన్ని బద్దలు చేసి మరీ, ఓటర్లు 'గుణపాఠం' చెప్పిన దరిమిలా, ఇంకా ముఖ్యమంత్రి పదవిలో వుండే నైతిక అర్హత చంద్రబాబుకి లేదన్నది నిర్వివాదాంశం.

Show comments